బ్రెయిన్‌ కేన్సర్‌తో గిరిజన విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ కేన్సర్‌తో గిరిజన విద్యార్థిని మృతి

Aug 29 2023 1:50 AM | Updated on Aug 29 2023 12:05 PM

- - Sakshi

గుమ్మలక్ష్మీపురం: బ్రెయిన్‌ కేన్సర్‌తో గిరిజన విద్యార్థిని హిమరిక ప్రమీల(13) విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. కొమరాడ మండలంలోని గాజులగూడకు చెందిన ప్రమీల గుమ్మలక్ష్మీపురం మండలం, రేగిడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 13వ తేదీన జ్వరం రావడంతో పాఠశాల సిబ్బంది కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, వైద్యసేవలు అందజేశారు.

అయినా జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ కూడా నయం కాకపోవడంతో ఈ నెల 14వ తేదీన విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా, ప్రమీలకు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధం కాగా, ప్రమీల శరీరం సహకరించడం లేదు.

అలా చికిత్స అందిస్తుండగా, ఒకానొక దశలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఐసీయూకి తరలించి, ఆక్సిజన్‌ సదుపాయం కల్పించినా ఫలితం లేదని, చికిత్స పొందుతూ మృతి చెందిందని ఏటీడబ్ల్యూవో సురేష్‌కుమార్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement