సోషల్ మీడియాలో పెడధోరణులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేస్తుందట. ప్రభుత్వం మీద వచ్చే నెగిటివ్ వార్తలపై నిఘా పెడతారట. అసభ్య పోస్గింగులను అరికట్టే నెపంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అడుగులు వేస్తోందా అన్న సందేహాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
అసభ్య పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాటిని కచ్చితంగా కంట్రోల్ చేయవలసిందే. కాని ఇప్పటికే అందుకు తగిన వ్యవస్థ ఏపీలో ఉంది. అయినా అది సరిపోవడం లేదని ప్రభుత్వం ఎందుకు అంటోంది? పోలీసు వ్యవస్థ సమర్థంగా ఆ దిశలో పనిచేయడం లేదని భావిస్తున్నారా? అసభ్య పోస్టింగ్‌లను ఎలాగైనా ఆపవచ్చు. అసలు సమస్య ఏమిటంటే కూటమి సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తుండడం కావచ్చు. దానిని కంట్రోల్ చేస్తే వచ్చే ఎన్నికలలో నెగ్గగలమన్న ఆశ ఉండవచ్చు. నిజానికి సోషల్ మీడియాతోనే గెలుపు ఓటములు నిర్ణయం కావు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేసే తీరు మొదలైనవి ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే అసత్య ప్రచారాల వల్ల నష్టం జరగదా అంటే కాదని అనలేం. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వైఎస్సార్‌సీపీకు చెందినవారు కాని, వారి సోషల్ మీడియా కాని అబద్దాలు చెప్పే అవకాశం తక్కువ. నిజాలు చెబుతుంటేనే పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్సార్‌సీపీవారిపై ఎన్ని కేసులు పెడుతున్నది కనబడుతున్న తరుణంలో కోరికోరి ఎవరు సమస్య తెచ్చుకుంటారు? సోషల్ మీడియా పోస్టులలో పచ్చి బూతులు పెట్టిన కొందరిని టీడీపీ ఎంకరేజ్ చేస్తున్నదన్న ఆరోపణ ఉంది.
జగన్ ప్రభుత్వ సమయంలో అలాంటివారిపై ఏవైనా చర్య తీసుకోబోతే ఇంకేముంది ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు, వాక్ స్వాతంత్రం, మీడియా స్వాతంత్రం పూర్తిగా పోయాయి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారితో పాటు ఎల్లో మీడియా వారు ఎన్ని ఆరోపణలు చేసేవారు? బహుశా వారు ఆ సంగతులు మర్చిపోయి ఉండవచ్చు. అరాచక పోస్టులు పెట్టిన ఒక వ్యక్తితో మహానాడులో ప్రసంగమే ఇప్పించారే! అది ఏపాటి మర్యాద అవుతుంది? వైఎస్ జగన్ కుటుంబంపైన, వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబాలపైన, ఆ పార్టీ మహిళా నాయకులపై ఎంత దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ మద్దతుదారులు కొందరు ఎలా చేశారో అందరికి తెలుసు. వారిలో కొందరికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. మరికొందరు అంతకన్నా పెద్ద పదవులలోనే ఉన్నారు కదా! బహుశా తమ అనుభవం రీత్యా, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాను అణచివేయడమే మార్గంగా భావించినట్లు ఉన్నారు.
మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాపైనే ఎక్కువగా చర్చ జరిపే పరిస్థితి వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు సాధారణంగానే అభ్యంతరకరంగా ఉండే సోషల్ మీడియాపై కేసులు పెడుతుంటారు. కాని వారి బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చాక మారిపోయింది. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ లోటుపాట్లపైన, వైఫల్యాపైన ప్రశ్నిస్తారో వారందరిపై ఏదో రూపేణా కేసులు పెట్టడమే పోలీసుల విధిగా మారిపోయినట్లుంది. అందుకే ఏకంగా సుమారు 1500 కేసులు సోషల్ మీడియాపై పెట్టారు. ఆ కేసులో 1300 మందిని అరెస్టు చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని సీపీఎం కార్యదర్శి వి. శ్రీనివాసరావు వంటివారు గొంతెత్తి చెబుతున్నారు.
రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహ కేసు పెట్టి కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీపీ మద్దతుదారుగా భావించే మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా రావణ్‌పై ఆ చట్టాన్ని ప్రయోగించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. వీరెవ్వరిని తప్పుపట్టని చంద్రబాబు ఈ కేసును వైఎస్సార్‌సీపీకి రుద్దాలని ప్రయత్నించడమే ప్రభుత్వ బలహీనతగా తీసుకోవాలి.
ఒకప్పుడు కులమతాలను రెచ్చగొడుతూ టివీలో నిత్యం మాట్లాడే ఒక నాయకుడిమీద ఆనాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెడితే దానిపై ఆ రోజుల్లో తెలుగుదేశం ఇంతెత్తున ఎగిరిపడింది. ఈ రోజుల్లో కూడా రాజద్రోహం ఏమిటి అని ప్రశ్నించింది. కాని తాను అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై దాడి చేయడమే కాదు.. ఒక చిన్న యూట్యూబర్‌పై రాజద్రోహం కేసు పెట్టి కూటమి సర్కార్ తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సంతృప్తిపరచడానికా? లేక సోషల్ మీడియాను భయపెట్టడానికా అన్నది వేరే సంగతి.
నిజానికి చంద్రబాబు ప్రభుత్వం దేనిమీద టాస్క్ ఫోర్స్‌లు వేయాలి? టీడీపీ, జనసేనలు కలిసి ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశాం. ఇంకెన్ని చేయాలి? వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎలాంటి పద్దతి అనుసరించాలి? అన్నవాటి మీద కదా! పెన్షన్ నాలుగువేలు చేయడం, మరికొన్నిటిని అరకొరగా అమలు చేయడం మినహా ఎన్నికల మానిఫెస్టోని తుంగలో తొక్కినట్లుగా వ్యవహరిస్తూ, సోషల్ మీడియాతో ఏదో ప్రమాదం ముంచుకువస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలట. ఇది తప్పు కాదు. కాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎన్ని అబద్దాలు ప్రచారం చేశారో జనానికి తెలియదా?
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే చేస్తుంటే, జగన్ ప్రజల భూములు కాజేస్తున్నారని చేసిన ప్రచారాన్ని ఏమంటారు?ఇప్పుడు అదే రీసర్వే తమ ఘనత అని ఎలా చెప్పుకుంటున్నారు? 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, అందుకు వలంటీర్లు బాద్యులని చెప్పిన సంగతి నిజమా? అబద్దమా? కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటూ చంద్రబాబు అచ్చంగా వాటి గురించి పలుమార్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే సీనియర్ నేతలలో ఒకరైన చంద్రబాబు వీటిగురించి పదే, పదే మాట్లాడడం సరైనదేనా. తనకు ఫలానా కులం వారైనా ఓట్లు వేయరా అని అడిగిన వ్యక్తిని పక్కనబెట్టుకున్నదెవరు?
ఒక సభలో మాట్లాడుతూ గతంలో శ్రీరాముడి తల తొలగించారని ఆరోపించడం సరైనదేనా? ఆ కేసులో పట్టుబడిన వ్యక్తి టీడీపీ మద్దతుదారు అని అప్పట్లో పోలీసులు వెల్లడించారే. ఆ వ్యక్తికి కూటమి అధికారంలోకి వచ్చాక ఐదు లక్షలు ఇచ్చారని వార్తలు వచ్చాయే! ఆదోనిలో శివాలయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకున్నాడని చంద్రబాబు చెప్పారు. దీనిపై చర్య తీసుకోవలసింది ఎవరు? పైగా అతను జనసేనకు చెందినవాడని వెల్లడైంది కదా! పదే, పదే ఇలాంటి విషయాలను ప్రస్తావించడం సమాజానికి మంచిదా? ఇవన్ని ఎందుకు! ఇతర మతాలను దూషిస్తున్న ఒక వ్యక్తి జోలికి ఎందుకు ప్రభుత్వం వెళ్లడం లేదు? ముఖ్యమంత్రి, లేదా కీలకమైన పదవులలో ఉండి మీ మతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడడం ద్వారా టీడీపీ నేతలు సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలిచారు?
తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి మతానికి అపచారం చేశారా? మంచి చేశారా? మతం గురించి ఇంతగా బాధపడుతున్నవారు అయోధ్య రామాలయంలో డోనేషన్ల స్కామ్ గురించి ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు. అది మతానికి జరిగిన నష్టం కాదా? కొద్ది రోజుల క్రితం ఒక సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను చెప్పిన విషయంపై సభలో ఉన్న మహిళలు చప్పట్లు కొట్టరా అని బాధపడ్డారు.. ఉచిత బస్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించామని ఆయన తన ప్రసంగంలో చెబుతుంటే ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తి చెంది తాను మంచి పనిచేస్తే చప్పట్లు కొట్టరా అని అడిగారు. నిజంగా ఫ్రీబస్ స్కీమ్‌పై ఇచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు అమలు చేస్తున్నదేమిటి?
తిరుపతి, అన్నవరం ఏ క్షేత్రానికి అయినా, రాష్ట్రంలో ఏమూల నుంచి ఏ మూలకైనా ఏ బస్ అయినా ఎక్కి వెళ్లవచ్చని కూటమి పార్టీలు ప్రచారం చేశాయా? లేదా? ఇప్పుడు అదేమాదిరి అమలు చేస్తున్నారా? లేక పలు షరతులు పెట్టారా? ఆడబిడ్డ నిధి, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీల మాటేమిటి? వలంటీర్లకు ఏమి చెప్పారు. ఆ తర్వాత ఎలా ఎగవేశారు? ఇలాంటివన్ని ప్రజలకు గుర్తున్నాయి కనుకే సభకు వచ్చినవారు చప్పట్లు కొట్టడం లేదేమో అన్న సంగతి చంద్రబాబు, ఇతర కూటమి నేతలు గుర్తిస్తే మంచిది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


