పసికందును ఖాళీ ప్రదేశంలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు అర్థరాత్రి ఏడుపు విని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు
నరసరావుపేట టౌన్: ఆర్థిక భారమో లేకా మరో ఇతర కారణమో తెలియదు గానీ నవమాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి నిర్మాన్యుష్య ప్రదేశంలో వదిలి వెళ్లింది. శిశువు చీకట్లో ఏడుస్తుండగా ఆరోధనలు విన్న ఆసుపత్రి సిబ్బంది అక్కడకు చేరుకొని కాపాడిన ఉదంతమిది. నరసరావుపేట పట్టణంలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల పరిధిలోని శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో మంగళవారం అర్థరాత్రి పసికందు ఏడుపు వినిపించింది. ఆసుపత్రి మేనేజర్ కృష్ణచైతన్యారెడ్డి అక్కడకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ రెండు రోజుల కిందట పుట్టినట్లు కనిపిస్తున్న ఆడశిశువును గుర్తించి వెంటనే వైద్యశాలకు తరలించారు. శిశువును వైద్యల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని గురువారం నరసరావుపేట రూరల్ పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. డీఎస్పీ హనుమంతరావు, ఎస్‌ఐ కిశోర్ వైద్యశాలకు చేరుకుని పసికందును పరిశీలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శిశువును అక్కడ ఎవరు వదిలి వెళ్లారు.. తల్లిదండ్రులు ఎవరు.. ఏ పరిస్థితుల్లో పసికందును నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న సీసీ కెమారాల పుటేజ్‌లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. శిశువుకు సంబంధించి తల్లిదండ్రులు లేదా కుంటుంబ సభ్యుల గురించి సమాచారం తెలిసిన రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.


