తాగునీటి చెరువులో దూకి ఆత్మహత్య ప్రకాశం జిల్లా పల్లెమల్లికి చెందిన గనిపినేని అభిలాష్
చిలకలూరిపేటటౌన్: ఇంటి నుంచి కళాశాలలో ఫీజు చెల్లించి వస్తానంటూ వెళ్లిన విద్యార్థి చెరువులో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లెమల్లి గ్రామానికి చెందిన గనిపినేని వెంకటేశ్వర్లు, నాగరాజా దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అభిలాష్ (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు చిలకలూరిపేట టిడ్కో గృహాల్లో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటూ చదువుకునేవాడు. ఏప్రిల్ తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయాడు.
సప్లిమెంటరీ ఫీజు చెల్లించి వస్తానంటూ ఈనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఏమైందో ఏమో తెలీదు గాని చిలకలూరిపేట పట్టణం పరిధిలోని టిడ్కో గృహాల సమీపంలోని తాగునీరు సరఫరా చేసే కొత్త చెరువు గట్టుపై బుధవారం అభిలాష్ దుస్తులు, బ్యాగు, ఐడీకార్డు, చెప్పులు ఉండటాన్ని పురపాలక సిబ్బంది గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్ అక్కడకు వచ్చి గజ ఈతగాళ్లతో చెరువులోనూ, ఫిల్టర్ బావిలోనూ గాలింపు ప్రారంభించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అభిలాష్ మృతదేహం చెరువులో తేలి కన్పించడంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మొదటి నుంచి కళాశాల పట్ల ఇష్టం లేదని, తనకు ఇష్టంలేని కారణంగానే ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యుల ద్వారా ప్రాథమిక సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు.


