పేకాటకు ప్రోత్సాహం.. దాడులతో బీభత్సం | - | Sakshi
Sakshi News home page

పేకాటకు ప్రోత్సాహం.. దాడులతో బీభత్సం

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి

మూడు పువ్వులు .. ఆరు కాయలుగా..

నాలుగు కార్లలో వచ్చి దాడిచేసిన 20 మంది

వాచ్‌మన్‌, స్క్రోరల్‌పై దాడితోపాటు

సీసీ కెమెరాలు, టేబుళ్లు, కుర్చీలు ధ్వంసం

చిలకలూరిపేట క్లబ్‌ నిర్వాహకుల పాత్రపైనా అనుమానాలు

పేకాట క్లబ్‌లను ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రభుత్వం

సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సాక్షి,టాస్క్‌ఫోర్స్‌: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతం జూదానికి అడ్డాగా మారింది. పల్నాడు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని పేకాట క్లబ్‌లు నిర్వహించడంలో సత్తెనపల్లి పేకాట క్లబ్‌కు మంత్రి లోకేష్‌, చిలకలూరిపేట పేకాట క్లబ్‌కు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉండడంతోనే ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ బడా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తమదేపై చెయ్యిగా నడవాలన్నట్లు ఆ రెండు పేకాట క్లబ్‌ల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరుతో ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పేకాట క్లబ్‌పై గుర్తు తెలియని దుండగులు గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు దాడి చేశారు. నాలుగు కార్లలో 20 మంది దుండగులు పేకాట క్లబ్‌ వద్దకు చేరుకుని, అక్కడ పనిచేస్తున్న వాచ్‌మన్‌ చింతపల్లి రాజు, స్క్రోరల్‌ (పేక ముక్కలు పంచే వ్యక్తి)రెడ్డి ఆదినారాయణలపై దాడి చేశారు. వారి ఇరువురి వద్ద ఉన్న రూ.2,400 నగదు, రెండు సెల్‌ఫోన్‌లు తీసుకున్నారు. లోపలికి వెళ్లి నాలుగు క్యాష్‌ కౌంటర్లను పగల గొట్టారు. కౌంటర్లలో నగదు లేకపోవడంతో కుర్చీలు, టేబుళ్లు, అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలేవీ రికార్డు కాకుండా డీవీఆర్‌ బాక్స్‌ను అపహరించుకుపోయారు. తిరిగి కారులో ఎక్కి నరసరావుపేట వైపు వెళ్లారనేది ప్రచారం. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి టౌన్‌ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, పోలీస్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పేకాట క్లబ్‌ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వాచ్‌మన్‌ రాజు, స్క్రోరల్‌ ఆదినారాయణతో మాట్లాడగా కారులో వచ్చారని ముందుగా నలుగురు దిగి తమను పట్టుకున్నారని, మిగిలిన వారు దాడి చేసి లోపలికి ప్రవేశించారని చెప్పారు. క్లబ్‌ ప్రెసిడెంట్‌ మేకల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాటాల పంపకాల్లో విభేదాలే కారణం?

సత్తెనపల్లి పేకాట క్లబ్‌ నిర్వహణలో వచ్చే లాభాల్లో నుంచి 50, 30, 20, 10 శాతం పర్సంటేజీల వంతున పంచుకునేందుకు ‘పెద్ద’మనుషుల ఒప్పందాలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రకారం వాటాల పంపిణీలో కొద్ది రోజులుగా జాప్యం చోటుచేసుకోవడంతో భాగస్వాములు ఎవరైనా దాడి చేయించి ఉంటారా? లేక వాటాలు మరికొన్ని రోజులపాటు ఆలస్యం చేసేందుకు నిర్వాహకులే దాడి చేయించారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రంగంలోకి పోలీసు బృందాలు

సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌పై దాడి జరగడాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మేరకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సత్తెనపల్లి పేకాట క్లబ్‌ ప్రాంతం నుంచి నరసరావుపేట వైపుగా రోడ్డుపైన ఉండే సీసీ కెమెరాలను పర్యవేక్షణ చేసుకుంటూ విచారణ చేపడుతున్నారు. సత్తెనపల్లి పేకాట క్లబ్‌పై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు కార్లలో నరసరావుపేట వైపు నుంచి చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా మార్టూరు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. వాచ్‌మన్‌ చింతపల్లి రాజు, స్క్రోరల్‌ రెడ్డి ఆదినారాయణల సెల్‌ఫోన్‌లు కూడా దుండగులు తీసుకొని వెళ్లడంతో ఆ ఫోన్లను ట్రాక్‌చేస్తూ పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. వీరిలో ఒకరిద్దరు పట్టుబడినట్లు సమాచారం.

సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌ ప్రారంభించిన నాటి నుంచి మూడు పువ్వులు .. ఆరు కాయలుగా సాగుతోంది. పేకాటరాయుళ్లను తీసుకువచ్చే బాధ్యత, పేకాట క్లబ్‌ నిర్వహణ, అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వచ్చిన ఆటగాళ్ల భద్రత ఏర్పాట్లు వంటి విధులను కూడా నిర్వాహకులు పంచుకొని క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో పల్నాడు జిల్లా వాసులే కాక గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతోపాటు హైదరాబాదు, నల్గొండ, తెలంగాణ వాసులు కూడా ఎక్కువగా వస్తున్నారు. రూ. వేల నుంచి రూ.లక్ష వరకు ఒక్కో విభాగంలో పదికి పైగా టేబుళ్లు ఏర్పాటు చేయడంతో జోరుగా పేకాట క్లబ్‌ నడుస్తోంది. సత్తెనపల్లి క్లబ్‌ నడవడం వల్లన చిలకలూరిపేట పేకాట క్లబ్‌కు వెళ్లే ఆటగాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సత్తెనపల్లిలోని పేకాట క్లబ్‌ను మూసి వేయించేందుకు చిలకలూరిపేట పేకాట క్లబ్‌ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement