యడ్లపాడు: విద్యారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇప్పటికే మండల, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్న జగ్గాపురం జెడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు ఎస్ ఆదినారాయణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన విద్యార్థులకు గణితాన్ని సులభతరం చేస్తూ.. వినూత్న బోధనా పద్ధతులతో వారి ప్రతిభను వెలికితీస్తూ.. విద్యారంగంలో విశిష్ట సేవలందించారు. బోధనలో వినూత్నం, లోకాస్ట్‌తో టీఎల్‌ఎం, ఐఎల్‌ఎం మెటీరియల్‌తో గణితాన్ని ఆసక్తికరంగా, గణిత, విజ్ఞాన ప్రదర్శనలతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం ఆయన ప్రత్యేకత. దూరదర్శన్‌సప్తగిరి ఛానల్‌లో 1నుండి 10వ తరగతి వరకు గణిత బోధకుడిగా సేవలందించారు. ఆదినారాయణ మార్గదర్శకత్వంలో విద్యార్థులు రాష్ట్రస్థాయి గణిత క్విజ్‌తో పాటు క్రీడలు, చిత్రలేఖనం, నాటక పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. 2012 నుంచి 2025 వరకు పాఠ్యపుస్తకాలు, మాడ్యూళ్ల రచయితగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ వైదిక గణిత రిసోర్స్ పర్సనన్‌గా కొనసాగుతున్నారు. వేదిక్ మ్యాథమెటిక్స్ విషయ నిపుణుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గణిత పాఠ్యపుస్తక రచయితగా విద్యారంగంలో తనదైన గుర్తింపు పొందారు. మానవతా సంస్థ ద్వారా 204 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం ఆయన విద్యా ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. గణితంలో ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో పాటు నూటికి నూరు మార్కులు సాధించారు. విద్యార్థులను వివిధ ప్రతిభా పరీక్షల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ.. వారు అనేక పతకాలు, నగదు బహుమతులు సాధించేలా మార్గనిర్దేశం చేశారు. ఉపాధ్యాయ బాధ్యతలే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఈనెల 5న విజయవాడలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి ఆయన పురస్కారాన్ని అందుకోనున్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


