డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు విచారణ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు విచారణ నిర్వహించాలి

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్‌ సుభాని

చిలకలూరిపేట: డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్‌ సుభాని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సెప్టెంబర్‌ ఒకటిన చలో ఢిల్లీ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అంటూ నిర్వహించిన డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో తీవ్ర అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. ఎంతో మంది పతకాలు సాధించిన వారిని పక్కన పెట్టి అనర్హులకు కొలువులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి 4లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా లక్షలాది మంది యువత నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. పరిశ్రమల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధి కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో స్పష్టమైన కార్యాచరణ కనపించటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రతి ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పరీక్షల్లో పేపర్‌ లీకులు, అవకతవకలను అరికట్టి నీట్‌ పరీక్షలను రాష్ట్రాల వారీగా నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు, సెప్టెంబర్‌ ఒకటిన నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని యువత విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు బొంతా ధనరాజ్‌, కె మల్లికార్జున్‌, కె అనిల్‌, వెంకట్‌, రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement