అత్తను హత్య చేయించిన అల్లుడు | - | Sakshi
Sakshi News home page

అత్తను హత్య చేయించిన అల్లుడు

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

అత్తను హత్య చేయించిన అల్లుడు

అత్తను హత్య చేసేందుకు రూ.30 లక్షలు సుపారీ నిందితులు విజయవాడ, చిలకలూరిపేట, పెదకూరపాడు, ప్రకాశం జిల్లా ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తింపు సత్తెనపల్లి డీఎస్పీ ఎంవీ కృష్ణ చైతన్య వెల్లడి నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

సత్తెనపల్లి: ఆస్తి కోసం అత్తను సుపారీ ఇచ్చి అల్లుడు హత్య చేయించిన నేరంలోని ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో హత్య నేరం వివరాలను డీఎస్పీ డాక్టర్‌ ఎంవీ కృష్ణచైతన్య వెల్లడించారు. పెదకూరపాడులో ఈనెల 5న ఆధార్‌ వెరిఫికేషన్‌ కోసం అంటూ ఇంటిలోకి ప్రవేశించి మహిళను కత్తితో పీక కోసి హతమార్చగా ఆమె భర్తను సుత్తితో తల పైకొట్టి గాయపర్చి దుండగులు పరారైన సంఘటన సంచలనం కలిగించింది. దీని పై క్షతగాత్రుడు అవ్వారి బాలగురవయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా జిల్లా ఎస్పీ సంతోష్‌, అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ డాక్టర్‌ ఎమ్‌వీ కృష్ణచైతన్య పర్యవేక్షణలో పెదకూరపాడు సర్కిల్‌ సీఐ పి సురేష్‌ కేసు దర్యాప్తును చేపట్టారు.

హత్య చేసేందుకు రూ. 30 లక్షలకు సుపారీ...

పెదకూరపాడుకు చెందిన అవ్వారి అరుణకుమారి బాల గురవయ్య అనే అతన్ని రెండో వివాహం చేసుకుంది. ఆమెకు మొదటి వివాహానికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె ప్రియాంకను పెదకూరపాడుకు చెందిన పానుగంటి బాలనరేశ్‌ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రెండో కుమార్తె చంద్రిక కూడా ప్రేమ వివాహం చేసుకుంది. కుమార్తెలిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడం అవ్వారి అరుణ కుమారికి ఇష్టం లేదు. అప్పటి నుంచి అరుణకుమారికి, తన కుమార్తెలకు మధ్యన మాటల్లేవు.అరుణకుమారికి ఉన్న పొలం, ఆస్తులు అమ్ముకొని వచ్చిన నగదుతో విజయవాడలో ఇల్లు కొనుక్కొని మిగిలిన కొంత డబ్బుతో బంగారం చేయించుకొని కొంత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకుంది.ఈ క్రమంలో పానుగంటి బాల నరేశ్‌ తన అత్త అరుణకుమారితో తన భార్యకు రావలసిన వాటా గురించి అడగగా దానికి అరుణ కుమారి తమ కుమార్తెలు తనకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నందున ఆస్తిలో వాటా ఇవ్వనని, చేతనైంది చేసుకోండి అని కరాకండీగా తేల్చి చెప్పింది. దీంతో పానుగంటి బాలనరేశ్‌ తన అత్త అరుణ కుమారుని చంపితే ఆస్తిని కాచెయ్యొచ్చు అనే ఉద్దేశంతో రూ.30 లక్షలకు మహేంద్రతో సుఫారి మాట్లాడుకుని కొన్ని ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసుకుని కోడు భాషలో మాట్లాడుకుంటూ పెదకూర పాడులో ఉండే అత్త అరుణకుమారి వివరాలు తెలియ పరచగా మహేంద్ర ఈ నెల 5న ఇంటి దగ్గరకు మోటార్‌ సైకిల్‌ పై వెళ్లి అరుణకుమారి ఇంట్లోకి ప్రవేశించి ఆధార్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చామంటూ ఆమెను కత్తితో పీక కోసి హతమార్చగా ఆమె భర్త గురవయ్య ను ఇనుప సుత్తితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు.

ఐదుగురు నిందితులు అరెస్ట్‌...

కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు పెదకూరపాడుకు చెందిన పానుగంటి బాలనరేశ్‌, ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెన్నంబొట్లవారిపాలెం చెందిన యెర్రగోపు మహేంద్ర అలియాస్‌ మహేష్‌ నాయుడు, విజయవాడ రామవరప్పాడు గ్రామానికి చెందిన నండ్రు నాగేశ్వరరావు, విజయవాడ రామవరప్పాడు గ్రామం గాంధీజీ కాలనీకి చెందిన కై లా కిశోర్‌ కుమార్‌ అలియాస్‌ చంటి, యడ్లపాడు గ్రామానికి చెందిన గోవిందు పవన్‌ కళ్యాణ్‌ అలియాస్‌ పవన్‌లను శుక్రవారం పెదకూరపాడు సీఐ పి సురేష్‌ అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు,నిందితుల అరెస్టు ప్రక్రియలో అమరావతి సీఐ వై.అచ్చయ్య, సత్తెనపల్లిటౌన్‌ సీఐ ఎన్‌.నాగమల్లేశ్వరరావు, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ, ఎస్‌ఐలు అల్లూరిరెడ్డి, డి.రవిబాబు, గోపి, పెదకూరపాడు పోలీస్‌ సిబ్బంది ఎన్‌ సువర్ణరావు, కె రమేష్‌ బాబు, బి రాజేష్‌కుమార్‌, ఎస్‌ పార్ధసారథి, టీ సురేష్‌లు సమన్వయంతో పనిచేసి నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారని, వారి కృషిని జిల్లా ఎస్పీ సంతోష్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement