గురజాల డీఎస్పీ మహేశ్వరరావు నిందితులు అరెస్టు
గురజాల:రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో నవులూరి చెన్నారెడ్డిని ఆధిపత్య పోరు కోసమే హత్య చేశారని గురజాల డీఎస్పీ మహేశ్వరరావు చెప్పారు. గురజాలలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య కేసులో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో నవులూరి చెన్నారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లు కేసు నమోదు చేశామన్నారు. విచారణలో మృతుని తండ్రి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి అనుచరులుగా ఉన్న కొంతమంది గ్రామంలో ఎదగాలనే ఉద్దేశంతో వేరే వర్గంగా విడిపోయారన్నారు. గ్రామంలో చెన్నారెడ్డి క్రియాశీలకంగా మారుతున్నాడనే అక్కసుతో ఎలాగైనా హతమార్చాలని నవులూరి అశోక్‌రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, మద్దిగపు పెరిరెడ్డి, జోగిరెడ్డిలు కుట్ర పన్నారన్నారు. పథకం ప్రకారం .. నవులూరి చెన్నారెడ్డిని కారుతో గుద్ది కళ్లలో కారం చల్లి అతికిరాతకంగా హతమార్చి పరారయ్యారన్నారు. విచారణలో భాగంగా 8వ తేదీన జోగిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని, శుక్రవారం దాచేపల్లిలోని మాచర్ల అడ్డరోడ్డు వద్ద నవులూరి అశోక్‌రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, మద్దిగపు పేరిరెడ్డిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. 2025వ సంవత్సరంలో బోనాలు సమర్పించే సమయంలో ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం వద్ద, హనుమ జయంతి వేడుకల్లో ప్లెక్సీలు ఏర్పాటు వంటి విషయాల్లో మాకు తెలియకుండా మీరు చేసేది ఏమిటని నవులూరి అశోక్‌రెడ్డిని ఇబ్బందులు పెట్టడంతోపాటు గత నెల 17వ తేదీన అశోక్‌రెడ్డి పొలంలో మోటారు స్వీచ్ ఆనన్ చేస్తుండగా కరెంటు షాక్‌కు గురికావడంతో ఇదంతా చెన్నారెడ్డి వర్గీయులు నన్ను హతమార్చేందుకు కుట్రచేస్తున్నారనే అనుమానంతో ఎలాగైనా చెన్నారెడ్డిని హతమార్చితే పెత్తనం వస్తుందని భావించి కుట్ర పన్నినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కారంపూడి సీఐ ఆవుల భాస్కర్, రెంటచింతల ఎస్‌ఐ నాగార్జున, తదితరులు ఉన్నారు.


