● లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదు
● గురజాల మాజీ ఎమ్మెల్యే
కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల: జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని జానపాడు రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ... 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, తాను గురజాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిడుగురాళ్ల పట్టణంలోని రైల్వే గేటు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు పర్యవేక్షించలేకపోయారని అన్నారు. రూ.50 కోట్లు మంజూరు చేయిస్తే రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది సుమారు రూ.10 కోట్లేనని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.400 కోట్లతో దాచేపల్లి – మాచర్ల హైవే, సుమారు రూ.70 కోట్లతో బైపాస్ పూర్తి చేశామని తెలిపారు. రూ.215 కోట్లతో మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో 90 శాతం, మెడికల్ కాలేజీ నిర్మాణంలో 60 శాతం పూర్తి చేశామని అన్నారు. సుమారు రూ.70 కోట్లతో ’నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని తెలిపారు. నెల రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ బ్రిడ్జి పూర్తయి ఉంటే సెంటు విలువ ఐదు రెట్లు పెరిగేదని అన్నారు. సర్వీస్ రోడ్డే కాకుండా జానపాడు గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టామని తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక రోడ్లన్నింటినీ తారు రోడ్లుగా మార్చాలన్నారు.
దోచుకోవడమే టీడీపీ లక్ష్యం
ఎంతసేపు దోచుకుందామా, దాచుకుందామా అనే ఆలోచనే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని విమర్శించారు. తాము వేసిన పునాది రాయిని తీసేసి వారు వేసినట్లు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల్లో రూ.10 కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు ఒక్క స్లాబ్ అయినా వేశారా అని నిలదీశారు. పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్‌కుమార్, చింతా సుబ్బారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముడేల వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టుపల్లి పూర్ణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి చల్లా పిచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ సాతులూరి బాబు, మండల మైనార్టీ కన్వీనర్ మోర్జంపాడు ఖాసీం, మండల మాజీ మైనార్టీ కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి, జానపాడు గ్రామ కన్వీనర్ దమ్మా హనుమయ్య, మాజీ ఎంపీపీ సూరాబత్తుని శ్రీను, మాజీ గ్రామ కన్వీనర్ సాంబశివరావు, గ్రామ మహిళా కన్వీనర్ పి. నీలిమ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బుజ్జి, బూత్ కన్వీనర్ ఆదాం, నాయకులు పలపాల లక్ష్మయ్య, సూరాబత్తుని మణి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


