నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకులు
మాచర్ల: డీఎస్సీలో అక్రమాలపై గురువారం నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరం ఏర్పాటు పనులను పోలీసులు బుధవారం రాత్రి అడ్డుకున్నారు. పట్టణంలో ఏర్పాటు చేస్తున్న శిబిరం వద్దకు పట్టణ సీఐ నజీర్‌బేగ్, ఎస్‌ఐ స్వర్ణలత చేరుకుని పనులు అడ్డగించారు. ప్రజలకు, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన సొంత స్థలంలో శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. అలా ఏర్పాటు చేయడానికి వీల్లేదని శిబిరం వద్ద ఉన్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పీఆర్కే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘శాంతియుతంగా , ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా మా సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్నామని’ సీఐకి ఆయన వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సీఐ చెప్పారు. ప్రశాంతంగా దీక్ష నిర్వహిస్తామని, శిబిరాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని పీఆర్కే తెలిపారు. పోలీసులతో పీఆర్కే చర్చించారు. ఆ ప్రాంతానికి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని పీఆర్కే తెలిపారు. దీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.


