మైనారిటీ యువకులకు ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

మైనారిటీ యువకులకు ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

మైనారిటీ యువకులకు ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ముగిసిన ప్రపంచ బ్యాంక్‌– ఏడీబీ బృందం పర్యటన సచివాలయ ఉద్యోగిపై వేటు ఉత్కంఠగా క్రికెట్‌ టోర్నీ

లక్ష్మీపురం: రాష్ట్ర మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన నిరుద్యోగ మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్‌, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీ) యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ షేక్‌ సాబిరా బేగం తెలిపారు. గుంటూరు నగరంపాలెంలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో ఈ వివరలు వెల్లడించారు. అభ్యర్థులు డిగ్రీ చదివి, 25 సంవత్సరాల వయస్కులై ఉండాలని తెలిపారు. వివరాలకు రిజిస్ట్రేషన్‌ లింక్‌ ద్వారా లేదా, 94499 01142, 96529 60367 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.

తాడికొండ: అమరావతిలో ప్రపంచ బ్యాంక్‌– ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ బృందం మూడు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, సోషల్‌ డెవలప్మెంట్‌ స్ట్రాటజీ విభాగ ముఖ్య అధికారులతో బృందం సమావేశమైంది. రాజధాని నగర పరిధిలో సామాజిక, పర్యావరణ అంశాలకు సంబంధించి అమలవుతున్న కార్యాచరణపై చర్చించి పలు సూచనలు చేశారు. రాజధాని నగర నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత పీపీఆర్‌ స్థితిగతులు, సంబంధిత అంశాలపై చర్చించారు.

తెనాలి అర్బన్‌: ప్రజలు చెల్లించిన కరెంటు బిల్లుల మొత్తాన్ని తన అవసరాలకు వినియోగించుకున్న సచివాలయ ఉద్యోగిపై మున్సిపల్‌ కమిషనర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. సంబంధిత ఉత్తర్వులను బుధవారం సాయంత్రం జారీ చేశారు. పట్టణ గంగానమ్మపేట–3 స్వర్ణ వార్డు (సచివాలయం)లో ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీగా ఎం.మల్లేశ్వరరావు పనిచేస్తున్నారు. తన వార్డు పరిధిలోని కొందరు వినియోగదారులు విద్యుత్‌ బిల్లులు చెల్లించారు. అందుకు సంబంధించిన రూ.28,082 నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నారు. ఈ విషయం ‘సాక్షి’ దినపత్రికలో ఆగస్టు 1న ‘ప్రభుత్వ నిధులు స్వాహా’ శీర్షికన ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామ అప్పలనాయుడు విచారణ జరిపారు. ఆరోపణలు నిర్ధారణ కావటం, గత నెల 23వ తేదీ నుంచి సదరు ఉద్యోగి ఎటువంటి అనుమతులు లేకుండా గైర్హాజరు కావటంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. చెంచుపేట స్వర్ణ వార్డులో పనిచేసే వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ ఉయ్యూల శ్రీనుపై బుధవారం రాత్రి ఇంటి పన్ను పేరు మార్పు విషయమై నగదు వసూలుచేసినట్టు కొందరు లబ్ధిదారులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కూడా ఆ కథనంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై వెంటనే విచారణ జరపాలని కూడా అసిస్టెంట్‌ కమిషనర్‌ జాస్తి రామారావును ఆదేశిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గుంటూరు లీగల్‌: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయవాదుల క్రికెట్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం రెండు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా జరిగాయి. మొదటి మ్యాచ్‌లో హబీబుల్లా జట్టు, వీసీకే–11 జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ప్రతిభ కనబరిచిన వి. మనోజ్‌కుమార్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యారు. రెండో మ్యాచ్‌లో చందు–11 జట్టు.. శ్రీను జట్టును ఓడించి విజేతగా నిలిచింది. ఆటతో ఆకట్టుకున్న సాజిద్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సహకరిస్తున్న న్యాయవాదులకు గుంటూరు బార్‌ అసోసియేషన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. అతిథిగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొల్లి శంకరరావు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement