వివాహిత దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

ఆధార్‌ కార్డు తనిఖీ పేరిట

వచ్చి దంపతులపై హత్యాయత్నం

తొలుత భర్తపై కత్తితో దాడి.. ఆపై భార్య

గొంతు కోసిన దుండగుడు

భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

పెదకూరపాడు: పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై కత్తితో దాడి చేసిన ఘటనలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పెదకూరపాడు గ్రామంలో సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెదకూరపాడు గ్రామంలోని దామచర్ల పాలెం కాలనీలో నివాసం ఉంటున్న అవ్వారి బాల గురవయ్య, అరుణ దంపతుల ఇంటికి ఆధార్‌ కార్డు వెరిఫికేషన్‌ నిమిత్తం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించి ఆధార్‌ కార్డు తీసుకురావాలని చెప్పారు. బాల గురవయ్య తెస్తున్న సమయంలో ఒక్కసారిగా కత్తితో దాడి చేశారు. తలపై గట్టిగా మోదగా అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం ఓ దుండగుడు ఇంట్లోకి వెళ్లి అరుణ (45)పై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఆమె కేకలు వేసుకుంటూ ఇంటి బయటకి పరుగులు తీసుకుంటూ వచ్చి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు కొందరు బాల గురువయ్యను పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పెదకూరపాడు డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ను పిలిపించారు. ఇటీవల బాల గురవయ్య తన పొలం అమ్మినట్టు స్థానికులు తెలిపారు. బాల గురవయ్య మొదటి భార్య పదిహేను సంవత్సరాల క్రితమే మృతి చెందింది. అనంతరం కృష్ణా జిల్లా నర్తనశాలకు చెందిన అరుణను రెండో వివాహం చేసుకున్నారు. అరుణకు కూడా ఇది రెండో పెళ్లి. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాల గురవయ్య మొదటి భార్య, ఆమె కుమార్తె కూడా పాము కాటుకు గురై గతంలో మృతి చెందారు. పెదకూరపాడులో గతంలో ఇదే ప్రాంతంలో దంపతులను కట్టేసి వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. దామచర్లపాలెం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైనా ఈ ఘటన జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement