న్యూస్‌రీల్
ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యల స్వాగతం
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి, నరసరావుపేట: హామీలివ్వడం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఓటర్లను మభ్యపెట్టడం ఆయన నైజం. మెగా రుణమేళా పేరిట నరసరావుపేట కోడెల శివప్రసాద్‌రావు స్టేడియంలో నేడు నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
వరికపూడిశెలకు తట్టెడు మట్టీ ఎత్తలేదు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా హామీలను అమలుచేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు ప్రజల చిరకాల కోరికై న వరికపూడిశెల ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి ప్రాజెక్టు చంద్రబాబుకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తుంది. అధికారంలోకి వస్తే వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మిస్తామంటారు...వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు అయితే పల్నాడు వాసుల ఓట్లకోసం వరికపూడిశెలకు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతప్రజలను మభ్యపెట్టేశారు. యువగళం పేరిట పాదయాత్ర చేసిన నారాలోకేష్ వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద వరికపూడిశెల ప్రాజెక్టు హామీనిస్తూ శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని రెండేళ్లు అవుతున్నా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగు, లక్షమందికి తాగునీరు అందించే విధంగా డీపీఆర్‌ను రూపొందించి అవసరమైన కేంద్ర అనుమతులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. 2023 నవంబర్‌లో ఈప్రాజెక్టు పనులను సైతం ప్రారంభించారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులను పక్కన పెట్టారంటూ వైఎస్సార్ సీపీ, కమ్యూనిస్ట్ నేతలు ఆరోపిస్తున్నారు.
కౌలు రైతులకు మొండిచెయ్యి
మరోవైపు జిల్లాలో నేడు పంపిణీ చేయనున్న రుణాల్లో కౌలు రైతులకు న్యాయం జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 8,057 మందికి మాత్రమే కార్డుల పంపిణీ జరిగింది. దీంతో అర్హులైన కౌలు రైతులు కార్డులు అందక పెట్టుబడి రుణాలు, బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, వివిధ రాయితీలను కోల్పోతున్నారు.
అభివృద్ధి జాడేలేని నరసరావుపేట
నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రంలో కీలకంగా ఉన్నామని చెప్పుకునే టీడీపీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న నరసరావుపేటలో రైల్వే స్టేషన్ పనులను రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రెండో ఫ్లాట్ ఫామ్‌లో రైలు ఎక్కడ ఆగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా రెండో ఫ్లాట్ ఫామ్‌లో డిజిటల్ బోర్డులు సైతం ఏర్పాటు చేయలేకపోతున్నారు.
● ఆటోనగర్ ఏర్పాటు సమస్య పట్టణంలో దీర్ఘకాలంగా ఉంది. గత ప్రభుత్వం కేసానుపల్లి సమీపంలోని ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి అప్పగించి ఆటోనగన్‌ర్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దీని ఊసే ఎత్తడం లేదు.
● శ్రీకృష్ణ చిత్రాలయ థియేటర్ వద్ద ఆర్‌యూబీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దీనివల్ల పట్టణంలోని ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
● మరోవైపు జిల్లా కేంద్రంలో ముఖ్యమైన రహదార్లను విస్తరించకపోవడంతో నిత్యం ప్రజలు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా భూ హక్కుల కోసం పోరాడుతున్న లింగంగుంట్ల ప్రజల సమస్యను మఠం, కోర్టులతో సంప్రదించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో
కలసి నేడు నరసరావుపేటలో
పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను
గుర్తుచేసుకుంటున్న పేట ప్రజలు
ఆటోనగర్ ఏర్పాటు హామీపై
దృష్టి పెట్టని బాబు సర్కార్
తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో
సతమతమవుతున్న ప్రజలు
రోడ్ల విస్తరణ, ఆర్‌యూబీ
నిర్మాణం చేపట్టాలని డిమాండ్
కోటప్పకొండ రోప్‌వేకు
2016లో శంకుస్థాపన
నేటికీ అందుబాటులోకి రాని వైనం
కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు
మంజూరు చేసినట్టు ప్రకటించి
మరచిన కూటమి ప్రభుత్వం


