వినుకొండ–కారంపూడి ప్రధాన రహదారిపై రైతుల ధర్నా అధికారుల నిర్లక్ష్యంతో 820 మందికి అందని అన్నదాత సుఖీభవ సాయం
ఈపూరు: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొచ్చర్లలో జరిగిన భూ రీసర్వే తప్పుల తడకగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం రాత్రి వినుకొండ–కారంపూడి రహదారిపై రైతులు భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా భూ సర్వే పూర్తి చేశారని ధర్నాలో రైతులు మండిపడుతున్నారు.
ఏకపక్షంగా రీసర్వే...
సర్వే సమయంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా సర్వేలు కానిచ్చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రికార్డుల్లోనూ తీవ్రమైన పొరపాట్లు చేశారని, ఒకరి భూమిని మరొకరి పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేశారని రైతులు వాపోతున్నారు. వాస్తవంగా ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెబ్‌ల్యాండ్–2లో బయటపడ్డ తప్పిదాలు..
ఇటీవల కాలంలో రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్–2 డేటా విడుదల చేయడంతో రీసర్వే తప్పిదాలు బయటపడ్డాయి. ఆన్‌లైన్ ద్వారా తమ భూముల అడంగల్, వన్ బీ పత్రాలను తీసుకున్న రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తప్పులు సరిదిద్దుకోవడానికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు వాపోయారు. సర్వే ప్రభావం వల్ల వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందని అంటున్నారు. అధికారుల తప్పిదం వల్ల కొచ్చర్ల గ్రామంలోనే 820 మంది రైతులు అన్నదాత సుఖీభవ లబ్ధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులే రీసర్వే తప్పులు సరిదిద్ది న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్
గంటలకు పైగా జరిగిన ధర్నా కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినుకొండ రూరల్ సీఐ బొప్పన బ్రహ్మయ్య, ఎస్‌ఐ కె. వేణుగోపాల్ ధర్నా ప్రాంతానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. స్థానిక తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు తహసీల్దార్ నళిని సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భూసమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన ముగించారు.


