ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ముఖ్యం

Jul 15 2026 1:52 AM | Updated on Jul 15 2026 1:52 AM

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ముఖ్యం

నరసరావుపేట: జిల్లాలో జూలై మాసంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు పరిస్థితులు, వర్షపాతం, పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయ శాఖ చేపడుతున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ– పంట నమోదు, సీసీఆర్‌సీ కార్డుల జారీ, కౌలు రైతులకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులపై సమగ్ర వివరాలు తెలియచేశారు జూన్‌ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనప్పటికీ జూలై నెలలో ఇప్పటివరకు వర్షపాతం గణనీయంగా తగ్గిందన్నారు. జూన్‌ ఒకటి నుంచి జూలై 13 వరకు జిల్లాలో 110.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని చెప్పారు. ఇది సాధారణంతో పోలిస్తే 18.40 శాతం తక్కువ అన్నారు. జూలై 13వ తేదీ నాటికి జిల్లాలో 23,721 హెక్టార్లలో ఖరీఫ్‌ పంటల సాగు పూర్తయిందని తెలిపారు. ఇది సాధారణ సాగులో 14.81శాతం అన్నారు. గతేడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రస్తుత సాగులో పత్తి పంట ప్రధానంగా ఉందన్నారు. ఇప్పటివరకు 8060మంది రైతులకు 1,311 మెట్రిక్‌ టన్నుల యూరియా, 465 మెట్రిక్‌ టన్నుల డీఏపీ పంపిణీ చేశామన్నారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు తగిన సలహాలు ఇస్తూ పంటల బీమా పథకం ఆవశ్యకతను వివరించాలన్నారు. సీసీఆర్‌సీ కార్డుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియను రైతు సేవ కేంద్రాల సిబ్బంది ద్వారా తెలియచేసి ఖరీఫ్‌ సాగు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ అధికారి కమలకుమారి, ఉద్యాన పంటల అధికారి వెంకటరావు పాల్గొన్నారు. కలెక్టర్‌కు అధికారులు జ్ఞాపిక అందజేశారు.

జిల్లాలో జాడలేని వాన

జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏ మండలంలోనూ వర్షపాతం నమోదు కాలేదని అధికారులు మంగళవారం వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 1655.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కేవలం 170.8 మి.మీ. మాత్రమే కురిసింది. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు అధికంగా కాస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement