కొనసాగే హక్కు లేదు | - | Sakshi
Sakshi News home page

కొనసాగే హక్కు లేదు

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

● విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల ధర్నా ● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌

టీడీపీ ప్రభుత్వానికి

నరసరావుపేట: రాష్ట్రంలో రూ. వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టి విద్యార్థులకు దిక్కుతోచని స్థితి కల్పించిన టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బందారపు యశ్వంత్‌ రఘువీర్‌ పిలుపు ఇచ్చారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ వద్ద వందల మంది విద్యార్థులతో కలసి మహాధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ రఘువీర్‌ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల వరకు అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని అన్నారు. సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించక దశాబ్దగా ఖాళీగా ఉన్న కుక్‌, కమాటి, వార్డెన్‌ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాప్‌ అవుట్స్‌ పెరిగిపోతున్నాయని తెలిపారు. డిగ్రీ, బీటెక్‌, పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో సర్టిఫికెట్‌ చేతికి రాక కళాశాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నికల్‌, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు.

వర్సిటీలలో గాడి తప్పిన పాలన

విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని గొప్పగా చెబుతూ యూనివర్సిటీలను గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. నిధులు కేటాయించకుండా విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు విభాగాలను మూసివేస్తున్నారని అన్నారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు మూడు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకోవాలనే కలలు కొంటున్న విద్యార్థులకు సర్కారు వైఖరి ఆటంకంగా మారిందన్నారు. పీజీ కళాశాలలు మూతపడటంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో అధికారంలోనికి వచ్చిన వెంటనే జీవో నెంబర్‌ 77 రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు దాని ఊసే పట్టకపోవడం విద్యార్థులను మోసం చేయటమేనని మండిపడ్డారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గురజాల నియోజకవర్గ కార్యదర్శి దుర్గా ప్రసాద్‌, నాయకులు జగదీశ్‌, శ్రీనివాస్‌, మధు, సామ్యూల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement