హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేత | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేత

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

నరసరావుపేట రూరల్‌: ప్రజా రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి ఇన్స్యూరెన్స్‌ చెక్‌ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అందజేశారు. హోంగార్డుగా పనిచేస్తున్న గౌరి ప్రభాకరరావు డిప్యూటేషన్‌ మీద గుంటూరు ఆర్టీఓ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది పాము కాటుతో ప్రభాకరరావు మృతిచెందాడు. మృతుని భార్య జ్యోతికి యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి రూ.34లక్షల చెక్‌ను అందించారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్‌ఐ ఎస్‌.కృష్ణ, యాక్సిస్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ కె.అంకారావు, క్లస్టర్‌ శాలరీ మేనేజర్‌ తిరుమల కుమార్‌ పాల్గొన్నారు.

కారును ఢీకొన్న లారీ..

దంపతులకు గాయాలు

నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్‌పై ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో కారు వెనుకభాగం నుజ్జునుజ్జుకాగా, కారులో ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి నరసరావుపేట వెళ్తున్న కారులో దంపతులు ప్రయాణిస్తున్నారు. నూతన బైపాస్‌పై గణపవరం వద్దకు రాగానే విజయవాడ నుంచి చైన్నె వెళ్తున్న లోడు లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో కారు వెనుకభాగం నుజ్జునుజ్జుకాగా, దంపతులకు స్వల్పగాయాలయ్యాయి.

మెడికల్‌ కాలేజీకి సీట్లు

కేటాయించడం హర్షణీయం

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

కోటా సాయికుమార్‌

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించటం ఎంతో హర్షణీయమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కోటా సాయికుమార్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ...పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు ప్రారంభం కావడం జిల్లాలోని విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ, పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. అయితే కేవలం సీట్ల కేటాయింపుతోనే పరిమితం కాకుండా కళాశాలలో అవసరమైన అధ్యాపకులు, వైద్యసిబ్బంది, ప్రయోగశాలలు, గ్రంథాలయం, విద్యార్థులకు వసతి గృహాలు, తాగునీరు, రవాణా తదితర అన్ని మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నాణ్యమైన వైద్య విద్య అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ భవిష్యత్తులో పీజీ కోర్సులు, సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను కూడా ఈ కళాశాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

దళిత ఉద్యమనేత

కోటి జేమ్స్‌ కన్నుమూత

చీరాల రూరల్‌: దళిత ఉద్యమనేత, చీరాల జాన్‌పేటకు చెందిన కోటి జేమ్స్‌ అనారోగ్యంతో సోమవారం తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు దళిత, ప్రజా సంఘాల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి జేమ్స్‌ మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎల్‌టీడీ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన.. కార్మిక నాయకుడిగా హక్కుల సాధన కోసం విశేష కృషి చేశారు. కారంచేడు మారణకాండ బాధితులకు బాసటగా నిలిచి, వారికి న్యాయం జరిగే వరకు ఆర్థికంగా, నైతికంగా అండగా ఉంటూ ఎన్నో పోరాటాలు సాగించారని నాయకులు గుర్తుచేసుకున్నారు. దళిత ఉద్యమ శిఖరం డాక్టర్‌ కత్తి పద్మారావుకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ.. దళిత మహాసభ ఉపాధ్యక్షుడిగా ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు. అత్యంత సాధారణ జీవితం గడిపిన జేమ్స్‌.. చివరి దశలో క్రీస్తు పరిచర్యలో గడిపారని వివరించారు. జేమ్స్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, దళిత, ప్రజా సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, మాచవరపు జూలియన్‌, కొరివి వినయకుమార్‌, దారా అంజయ్య, పులిపాటి బాబురావు, గోసాల ఆశీర్వాదం, దుడ్డు భాస్కరరావు, భగత్‌సింగ్‌, తేళ్ల వెంకటస్వామి, బి.లక్ష్మీనరసయ్య, గొర్రెపాటి రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement