నాదెండ్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... నుదురుపాడు గ్రామానికి చెందిన పారెళ్ళ అనిల్‌కుమార్ (27) కేరళలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో తమ బంధువు మృతి చెందటంతో ద్విచక్రవాహనంపై వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో నాదెండ్ల–అప్పాపురం డొంక రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పి గోతిలో పడింది. స్థానికులు గమనించి 108కు సమాచారమిచ్చారు. అనిల్‌కుమార్‌ను చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించటంతో స్వగ్రామమైన నుదురుపాడుకు తరలించారు.
నకరికల్లు: మండలంలోని చల్లగుండ్ల గ్రామంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. ఈ సంఘటన గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన డి.పెదలాజర్ నాలుగెకరాల వరిగడ్డిని సుమారు రూ.50 వేలతో కొనుగోలు చేసి నిల్వ చేశాడు. శనివారం ఉదయం సమయంలో వరిగడ్డికి నిప్పంటుకుంది. చుట్టుపక్కల వారు గమనించే సరికి మంటలు చెలరేగాయి. నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల ఫైరింజన్ యంత్రాంగం గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. అప్పటికే వరిగడ్డి మొత్తం అగ్నికి ఆహుతైంది. అసలే మేత దొరకని గడ్డుకాలం వస్తున్న తరుణంలో తమకు భారీ నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరువెస్ట్(క్రీడలు): గుంటూరులోని రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి బిలియర్ట్స్ చాంపియన్‌న్ షిప్ పోటీల విజేతగా కాకినాడకు చెందిన శివశర్మ నిలిచాడు. ద్వితీయ స్థానంలో గుంటూరుకు చెందిన బద్రు జుబేర్ నిలిచాడు. శనివారం జరిగిన విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేతలు అమర ఆదినారాయణ, అమర అజయ్ మాట్లాడుతూ గత పది రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మందికి పైగా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి పోటీలను విజయవంతం చేయడం అభినందనీయమని క్రీడాకారులు ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు సుమారు రూ.1.50 లక్షలు నగదు రూపంలో అందజేశామని చెప్పారు. భవిష్యత్‌లో రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి బిలియర్డ్స్ పోటీలను నిర్వహించడంతో పాటు గుంటూరును ఈ క్రీడకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.
తెనాలిరూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ ఐదో నంబరు ప్లాట్‌ఫాంపై శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ఐదో నంబరు ప్లాట్‌ఫాం పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేశాడు. కాళ్లు తెగిపోయి తీవ్ర రక్తస్రావమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లి రూరల్: ఇద్దరు బాలికల అదృశ్యంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాలు.. మంగళగిరి– తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట, అంబేడ్కర్ కాలనీలో బాలికలు వారి తల్లిదండ్రుల కలసి నివాసం ఉంటున్నారు. మొహరం కుమార్తె ఇస్రా, అస్మతున్నిసా కుమార్తె నూర్‌జహాన్ కనిపించకుండా పోయారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉదయం తాడేపల్లి ప్రెస్ క్లబ్ వద్ద మంగళగిరి వెళ్లే ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


