ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి ఫ్యాప్టో పిలుపు
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఫ్యాప్టో రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా ఈనెల 14వ తేదీ మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నట్టు ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్ ఎల్.వి.రామిరెడ్డి బుధవారం తెలిపారు. అరండల్‌పేటలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, పీఆర్‌సీ కమిటీ కమిషనర్ నియామకం, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డీఏల విడుదల వంటి డిమాండ్లతో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్యాప్టో సెక్రటరీ జనరల్ బి.సంపత్‌బాబు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.మోహనరావు, డి.శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శి ఆర్.గోవిందరాజులు, పమ్మి వెంకటరెడ్డి, ఏ.ఏమండీ, భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్ ముట్టడి పోస్టర్‌ను విడుదల చేశారు.
చోరీలకు పాల్పడిన నలుగురు అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఇంట్లో బంగారం, మొబైల్ దుకాణంలో దొంగతనాలకు పాల్పడిన నలుగుర్ని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి, 229.5 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు, ఐఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు వెల్లడించారు. తెనాలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కఠెవరం గ్రామంలో జరిగిన ఓ ఇంటి దొంగతనం, తెనాలి పట్టణంలోని ఒక మొబైల్ దుకాణంలో మొబైల్‌ఫోన్లు అపహరించడంపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ ఎస్‌కె.నయాబ్‌రసూల్, ఎస్‌ఐ కె.ఆనంద్ పోలీస్ బృందంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో అంగలకుదురు– యడ్లపల్లి రహదారిపై తనిఖీలు నిర్వహించగా, నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కారు డ్రైవర్ 23 ఏళ్ల వేజెండ్ల జోసెఫ్ అతనికి సహకరించిన గొడవర్రు గ్రామానికి చెందిన బేతపూడి సురేష్, ప్రస్తుతం అంగలకుదురు గ్రామంలో ఉంటున్న రికవరీ ఏజెంట్ చావలి పవన్‌తేజ, చావలి వంశీ అలియాస్ నానిలను అరెస్ట్ చేశారని అన్నారు. వారి నుంచి 229.5 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు, ఐఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. జోసెఫ్ కార్ డ్రైవర్‌గా చేస్తూ చెడు వ్యసనాలకు అలవాటయ్యాడు. సలభంగా డబ్బు సంపాదించాలని వరుస చోరీలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. మొబైల్ దుకాణంలో, ఓ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమారు రూ.2 లక్షలు, భారీగా బంగారు సొత్తు అపహరించాడని అన్నారు. దొంగిలించిన బంగారాన్ని స్నేహితుడైన బేతపూడి సురేష్‌కు అప్పగించగా, అతను చావలి పవన్‌తేజ, చావలి వంశీల సహకారంతో పొన్నూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో విడతల వారీగా సుమారు 50 గ్రాములు తనఖా పెట్టారని తేలిందన్నారు. తద్వారా వచ్చిన నగదు పరస్పరం పంచుకుని వ్యక్తిగత అవసరాలు, విలాసాలకు వినియోగించారని విచారణలో వెల్లడైందన్నారు. మిగతా బంగారం, నగదుతో గోవా వెళ్లేందుకు పథకం వేశారని అన్నారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్థనరావు, రూరల్ పీఎస్ సీఐ ఎస్.కె.నయాబ్‌రసూల్, ఎస్‌ఐ కె.ఆనంద్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గరుడబిల్లి–గొట్లాం, దొంకినవలస–కోమటిపల్లి మధ్య నేటి నుంచి జరుగుతున్న సమగ్ర ఆర్‌వీఎన్‌ఎల్ పనుల కోసం ట్రాఫిక్–కమ్–పవర్ బ్లాక్ (రైళ్ల రాకపోకలు, విద్యుత్ సరఫరా నిలిపివేత) కారణంగా, రాయగడ–విజయనగరం మధ్య నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ డీసీఎం వినయ్‌కాంత్ బుధవారం తెలిపారు. గుంటూరు–రాయగడ(17243) ఎక్స్‌ప్రెస్ ఈనెల 8 న బయలుదేరే ఈ రైలు రాయగడ వరకు కాకుండా, విజయనగరం వరకే నడుస్తుందని తెలిపా రు. రాయగడ–గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 9న ఈ రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుంచే ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు.


