వక్ఫ్‌బోర్డు స్థలంలో షాపుల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు
ఈ నెల రెండున ఉత్తర్వులు
జారీ చేసిన కోర్టు
అధికారులకు విషయం తెలియచేసినా ఆగని పనులు
కొనసాగుతున్న నిర్మాణాలపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు తెలియచేసిన పిటిషన్‌దారులు
నరసరావుపేట: స్థానిక మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలం టీఎస్ నంబరు 1422లో చేపట్టిన షాపుల నిర్మాణాన్ని యథాతఽథంగా ఆపేయాలని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వరవకట్టకు చెందిన షేక్ అబ్దుల్‌ఖాజా, అరండల్‌పేటలో మహబూబ్ సుభాని వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్న షేక్ జానీమౌలాలి వక్ఫ్‌బోర్డు, మున్సిపాల్టీ ముందస్తు అనుమతులు లేకుండా వక్ఫ్‌బోర్డు సంస్థ స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్డుమెంట్, స్టేట్ వక్ఫ్‌బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కలెక్టరేట్‌లోని ఇన్‌స్పెక్టర్ ఆడిటర్, అహలే సున్నత్ జామియా మసీదు సంఘం అధ్యక్షులు షేక్ కరిముల్లా, సెక్రటరీ షేక్ రహమత్‌ఆలీ, కోశాధికారి షేక్ ఖాసీంపీరా, మెంబర్ షేక్ సుభాని, నాయబ్‌బజారుకు చెందిన షేక్ రహమత్‌ఆలీ, షేక్ మదీనా రసూల్, బాబాపేటకు చెందిన షేక్ మహబూబ్, వేముల చిరంజీవి, వేముల శంకరనారాయణ, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌లను ప్రతివాదులుగా చూపిస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో ఈనెల రెండో తేదీన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జానీమౌలాలి ఈనెల నాల్గున స్థానిక మున్సిపల్ అధికారులు, విజయవాడ వక్ఫ్‌బోర్డు సీఇవో, ఈనెల ఏడున వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియచేశారు. అయినప్పటికీ నిర్మాణాలు ఆపకుండా జరుగుతుండటంతో సోమవారం తాను జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి అయిన ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, విద్యుత్‌శాఖ డీఇలను కలిసి నిర్మాణాలను ఆపాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. పనులను ఆపని పక్షంలో కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ వినతిపత్రంలో పేర్కొన్నామని షేక్ జానీమౌలాలీ వెల్లడించారు. కాంప్లెక్స్‌కు విద్యుత్ కనెక్షన్ల పెట్టిన దరఖాస్తులను నిలిపివేసి కోర్టు ఉత్తర్వులు అమలుచేయాలని విద్యుత్ శాఖాధికారులను సైతం కోరారు.


