వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట: వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలన దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. జేసీ మాట్లాడుతూ సమష్టి కృషితోనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. వెట్టిచాకిరి ఒక సామాజిక దురాచారమని, భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, కార్మిక శాఖ అధికారులు, నీడ్స్, డీఆర్‌బీసీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్థిక అక్షరాస్యతపై పోస్టర్ ఆవిష్కరణ..
నరసరావుపేట: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. ఈ వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేఎస్ రాంప్రసాద్, డీఆర్‌డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ సంజన సింహా


