పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్‌ సీపీ నేతల ములాఖత్‌ | - | Sakshi
Sakshi News home page

పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్‌ సీపీ నేతల ములాఖత్‌

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్‌ సీపీ నేతల ములాఖత్‌

పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్‌ సీపీ నేతల ములాఖత్‌

తిరునాళ్లలో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించం

వెల్దుర్తి: జంట హత్యల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను సోమవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ వెల్దుర్తి మండల నాయకులు ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా వెల్దుర్తి నాయకులు ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించి వారిని ఇబ్బందులకు గురిచేయటం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి సోదరులపై కుట్రతో జంట హత్యల కేసును బనాయించిందన్నారు. ఇలాంటి అక్రమ కేసులు తమ నాయకులను ఏమీ చేయలేవన్నారు. ములాఖత్‌ అయినవారిలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు రాయంకుల గోపాల్‌, మండాది సర్పంచ్‌ శీలం సైదారెడ్డి, కండ్లకుంట సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడికొండ పుల్లారెడ్డి, కండ్లకుంట మాజీ సర్పంచ్‌ అమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు.

డీఎస్పీ ఎం.హనుమంతరావు

నరసరావుపేట టౌన్‌: మహాశివరాత్రి సందర్బంగా కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్‌ ప్రభల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హెచ్చరించారు. సోమ వారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన జరిగే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా సాధారణ ప్రభలు 100, విద్యుత్‌ ప్రభలు 30 నుంచి 40 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలయాల పరిసరాలలో డెకరేషనన్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసే ప్రదేశాలు, విద్యుత్‌ ప్రభల వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభల నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీసభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల అధికారుల సమన్యయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్‌కి అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల ఉత్సవాలు జరిగేలా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్లు ఊడ్చి పీఏసీఎస్‌ ఉద్యోగుల నిరసన

సమస్యలు పరిష్కరించి..ఆకలి తీర్చాలని విజ్ఞప్తి

కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు శ్యామలానగర్‌లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్‌ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

● ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్‌ 36ను అమలు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్‌ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకట రామయ్య, కె.సత్యనారాయణ, బి.రఘురామ్‌, పి.సత్యనారాయణ, వై.రామచంద్రరావు, పి.సుబ్బారావు, కె.వీరయ్య, ఏలూరు, కోనసీమ జిల్లాల పీఏసీఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement