భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు

భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు

నరసరావుపేట రూరల్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు అందాయి. నరసరావుపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ ఎం.వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో పాటు పలు మోసాలకు సంబంధించిన 99 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భూ వివాదలపై 27, ఆర్థిక సమస్యలపై 24, భార్యభర్తల వివాదాలు 14, ఆస్తి వివాదాలు 11, ఉద్యోగాల పేరుతో మోసాలపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను డీఎస్పీ ఆదేశించారు.

లండన్‌లో ఉద్యోగం అంటూ మోసం

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేసినట్టు సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెపాలెంకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. 2024 డిసెంబర్‌లో నగదు తీసుకుని ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, మోసానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

తప్పుడు లెక్కలతో ‘ఫైనాన్స్‌’ వేధింపులు

కారంపూడి మండలం కాకానివారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి 2023లో పాతఆటోను ఫైనాన్స్‌లో రూ.2.20లక్షలకు తీసుకున్నాడు. ఇందుకు గాను రూ.25వేలు డౌన్‌ పేమెంట్‌ కట్టి ప్రతి నెల రూ.9వేలు చెల్లించేవిధంగా ఒప్పందం చేసుకున్నాడు. 24 నెలల పాటు డబ్బులు చెల్లించినా బండి క్లియరెన్స్‌ ఇవ్వకుండా ఆటో ఫైనాన్స్‌ వారు వేధిస్తున్నారని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

రైల్వే ఉద్యోగం పేరిట టోకరా

పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన యువకుడు కేతనకొండ ఆర్‌కే కాలేజీలో పాలిటెక్నిక్‌ రెండవ సంవత్సరం చదువుతూ మానేశాడు. ఆ సమయంలో కడపకు చెందిన వ్యక్తి పరిచయమై రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35.18లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపాడు. పలు మార్లు ఫోన్‌లో సంప్రదించగా రూ.3లక్షలు తిరిగి ఇచ్చాడని, ఇప్పుడు ఫోన్‌లో కూడా స్పందించడం లేదని న్యాయం చేయాలని వేడుకున్నాడు.

పీజీఆర్‌ఎస్‌కు 99 అర్జీలు

స్వీకరించిన మహిళా

పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement