మంగళగిరిలో మేఘాలయ ఎన్‌హెచ్‌ఎం బృందం పర్యటన
మంగళగిరిటౌన్:గుంటూరు జిల్లా మంగళగిరి లో మేఘాలయ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) బృందం పర్యటించింది. ఈ మేరకు అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ అవలంబిస్తున్న విధానాలను మంగళగిరిలోని పలు యూపీహెచ్ సెంటర్లలో సోమవారం బృందం సమీక్షించింది. ఇందిరానగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పథకాల అమలు పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న మాత్రలు, ఇతర చర్యల గురించి వైద్య అధికారులు వివరించారు. కార్యక్రమంలో మేఘాలయ ఎన్‌హెచ్‌ఎం సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇందిరానగర్ యూపీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్‌కు జాతీయ గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు
వినుకొండ:క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ గీసిన మహేంద్ర మాత మేదరి చిత్రటానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు లభించింది. జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్థమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన జెస్టిస్‌ను పలువురు అభినందించారు.
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
చిలకలూరిపేట: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పీవీ లక్ష్మీ సత్యనారాయణాచార్యులు ఏఈగా విధు లు నిర్వహిస్తున్నారు. ఓ అప్రోచ్‌రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పెద్ద మస్తానయ్యకు రూ.8 లక్షలు బిల్లు చెల్లించేందుకు మూడు శాతం అంటే రూ. 24 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించటంతో, ముందస్తు వ్యూహం ప్రకారం రూ. 24వేలు లంచం తీసుకుంటుండగా ఏఈను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు పాల్గొన్నారు.
గాయత్రీ మాత ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు
గుంటూరురూరల్: చౌడవరం గ్రామం దాసరిపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పంచముఖి గాయత్రీ మాత దేవాలయంలో 74వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గాయత్రీ మాత సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి పట్టుచీరె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మహోత్సవాల నిర్వహణను దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ వడ్డే రామిరెడ్డి, సెక్రటరీ వడ్డే విజయభాస్కర్‌రెడ్డి, కమిటీ సభ్యులు
పర్యవేక్షించారు.
మంగళగిరిలో మేఘాలయ ఎన్‌హెచ్‌ఎం బృందం పర్యటన
మంగళగిరిలో మేఘాలయ ఎన్‌హెచ్‌ఎం బృందం పర్యటన


