ముగిసిన కొండవీడు ఉత్సవాలు
చరిత్ర, వినోదం మేళవించిన వేడుక
యడ్లపాడు: చారిత్రక వైభవానికి నిలయమైన కొండవీడు కోట ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. రెండు రోజుల పాటు పర్యాటకులను, సందర్శకులను అలరించిన ఈ వేడుకలు గతాన్ని స్మరించుకున్నాయి. పగటివేళ కొండపై ఏర్పాటు చేసిన హెలిరైడ్, ఫ్లవర్ స్టాల్, బోటింగ్, శాండ్ ఆర్ట్, ట్రెక్కింగ్‌లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పోటాపోటీగా సాగాయి. సాయంత్రం కొండ దిగువన ఏర్పాటు చేసిన లేజర్ షో, బాణసంచా కాల్పులు, సినీ గాయని గీతామాధురి సంగీత విభావరి, జబర్దస్త్ కళాకారుల కామెడీ స్కిట్లు, వెస్ట్రన్ డానన్స్‌లు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి బీజీ జనార్థనరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పల్నాడు బీజేపీ అధ్యక్షుడు ఏలూరి, గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్లా, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ సంజనా సింహ, ఆర్డీవో మధులత, డీఎఫ్‌వో జి. కృష్ణప్రియ, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు హాజరై ప్రసంగించారు.


