జిల్లాలో 237 ఫోన్లు రికవరీ
బాధితులకు అందజేసిన బాపట్ల ఎస్పీ
బాపట్లటౌన్: జిల్లాలో జనవరి మాసంలో రూ.50 లక్షల విలువైన 237 ఫోన్లను రికవరీ చేశామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాధితులకు ఫోన్లను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఐటీ కోర్ బృందం, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి, వివిధ ప్రాంతాల్లో పోయిన 237 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైన, విలువైన వస్తువుగా మారిందన్నారు. కేవలం సమాచార మార్పిడికే కాకుండా, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక లావాదేవీలు ఇతర పలు వివరాలను ప్రతి ఒక్కరు ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకుంటే దానిలో ఉన్న సమాచారాన్ని తిరిగి పొందడం కష్టసాధ్యంగా ఉంటుందన్నారు. ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే www.ceir.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఆ పోర్టల్‌లో బ్లాక్ స్టాలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షనన్‌ను ఎంచుకుని, ఫోన్ ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొన్న రసీదు కాపీని అప్‌లోడ్ చేయాలన్నారు. ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా పోయిన ఫోన్‌న్‌ను ఎవరైనా వాడాలని ప్రయత్నిస్తే ఆ ఫోన్ సిగ్నల్ పనిచేయకుండా బ్లాక్ అవుతుందన్నారు. తద్వారా ఫోన్ ట్రేసింగ్ సులభమవుతుందన్నారు. బిల్లులు లేని ఫోన్లను కొని అనవసరమైన ఇబ్బందుల్లో పడవద్దని ప్రజలను ఎస్పీ సూచించారు.


