లబోదిబోమంటున్న మహిళ
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోలకంపాడు నుంచి ఉండవల్లి దళితకాలనీకి వెళ్లే కరకట్టపై పట్టపగలు నలుగురు మహిళలు ఉండగా ఒక మహిళను టార్గెట్ చేసి ఆమె అరువు తెచ్చుకున్న బంగారపు గొలుసును చైన్‌స్నాచర్లు లాక్కెళ్లిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి పరిధిలోని దళిత కాలనీకి వెళ్లే కరకట్టపై ఉదయం కోటిచుక్కల లక్ష్మి తన బంధువులతో కలసి శుభకార్యానికి వెళుతున్నారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి వీరిని దాటుకుని వెళ్లారు. రెండునిమిషాల వ్యవధిలో తిరిగి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మి మెడలోని బంగారం గొలుసును, సూత్రాలతో సహా లాక్కెళ్లారు. ఈక్రమంలో కోటిచుక్కల లక్ష్మి కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చైన్ స్నాచర్లు పరారయ్యారు. పక్కనే ఉన్న మహిళలు బండి ఢీకొందని అనుకున్నారు. కానీ మెడలో తాడు లాక్కెళ్లారని చెప్పడంతో మిగిలిన మహిళలు పెద్దగా కేకలు వేశారు. అప్పటికే ద్విచక్రవాహంపై వారు పరారయ్యారు. కోటిచుక్కల లక్ష్మి బంధువుల ఇళ్లలో శుభకార్యానికి వెళుతూ.. పక్క ఇంటిల్లోని వారు గొలుసును అరువుకు తెచ్చుకుని మెడలో వేసుకుంది. సుమారు 30 గ్రాములు ఉండే ఆ బంగారు గొలుసు లాక్కెళ్లడంతో గొలుసు యజమానికి డబ్బులు ఎలా కట్టాలని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్‌ఐ సంఘటనా స్థలానికి వచ్చి బాధిత మహిళ వద్ద వివరాలు తెలుసుకున్నారు. నలుపు, ఎరుపు ద్విచక్రవాహనంపై ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు వెనుక కూర్చున్నారని, వారిలో ఒక టక్ చేసుకుని ఉన్నారని లక్ష్మి తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఐ ఖాజావలి పలుచోట్ల సిసి కెమెరాలను పరిశీలించగా ఆమె చెప్పిన గుర్తులతో ఉన్న యువకులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుకుంటూ ఉండవల్లి సెంటర్‌వైపు వెళ్లారు. జరిగిన సంఘటనపై ఎస్‌ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న బిహార్‌కు చెందిన వ్యక్తులు అని పోలీసులు భావిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ ఖాజావలి సూచించారు.
లబోదిబోమంటున్న మహిళ


