
నూతన మూల్యాంకన విధానం పెనుభారం
ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు
చిలకలూరిపేట: ప్రభుత్వం రూపొందించిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పెనుభారంగా మారిందని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు విమర్శించారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్ష పేపర్ ద్వారా నిర్వహించటం దానిని మరలా బుక్‌లెట్‌లో నమోదు చేయించడం వలన సమయం వృధా అవుతుందని తెలిపారు. ఎస్‌సీఈఆర్‌టీ ముద్రించిన పుస్తకాలను సకాలంలో పాఠశాలకు చేర్చలేకపోవడం వలన ఆ వివరాలు నమోదు చేసుకోవడానికి ఒక రోజు పూర్తి టైం సరిపోతుందని వాపోయారు. మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలకు తెప్పించుకోవడం పాఠశాల నుంచి తరగతి, సబ్జెక్టుల వారీగా వేరు చేసుకుని విద్యార్థుల వివరాలు నమోదు చేయడం తలకు మించిన భారం అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే అనేక యాప్‌లతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ బుక్‌లెట్‌లను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ పట్టణ అధ్యక్షుడు మేకల కోటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి వి.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.