
రైతులపై యూరియా బాదుడు!
జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం వివరాలు
● మార్కెట్లో యూరియా కొరత
ఉందంటూ జోరుగా ప్రచారం
● అడ్డగోలుగా ధరలు పెంచి
సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
● బస్తాపై రూ.వంద వరకు పెంచి
రైతులను దోచుకుంటున్న వైనం
● కొరత భయంతో సీజన్ మొత్తం
సరిపోయేలా కొంటున్న అన్నదాతలు
● సమస్య పరిష్కారంలో వ్యవసాయ
శాఖ అధికారులు విఫలం
జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. కొరతను సాకుగా చూపి వ్యాపారులు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు జిల్లాలో సరిపడా ఎరువులు ఉన్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. దీంతో సాగుకు అవసరమైన మొత్తం యూరియాను రైతులు ఒకేసారి అధిక ధరకు కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నరసరావుపేట రూరల్: జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఒక వైపు జోరుగా వర్షాలు, మరో వైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడంలో ఈ ఊపు కొనసాగుతోంది. వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ముందస్తుగా బోరు బావుల కింద నారుమళ్లు వేసిన రైతులు నాటు వేసే పనులు చేపట్టారు. కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూమి పదునెక్కడంతో పత్తి విత్తనాలను పెద్ద ఎత్తున విత్తారు.
వ్యాపారుల మాయాజాలం
రైతులను యూరియా కొరత వేధిస్తోంది. వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వం బస్తా ధర రూ.280గా నిర్ణయించగా, వారు రూ.380 వరకు విక్రయిస్తున్నారు. దాదాపు రూ.100 అధికంగా రైతుల నుంచి అదనంగా పిండేస్తున్నారు. సీజన్ మొత్తానికి అవసరమైన యూరియాను రైతులు భయంతో ఒకేసారి కొనుగోలు చేస్తున్నారు. నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా ఎరువుల వ్యాపారులు యూరియా ధరలు అడ్డగోలుగా పెంచుకుంటూ పొతున్నారు.
మొద్దు నిద్రలో అధికారులు
ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చేస్తున్న ప్రకటనలను వ్యాపారులు పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా కొన్ని దుకాణాల్లో తనిఖీలు చేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. జిల్లా అధికారులు ఉండే నరసరావుపేటలోనే బస్తాకు రూ.100 అధికంగా దోచుకుంటున్నారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు,. పిడుగురాళ్లలోనూ ఇదే దోపిడీ కొనసాగుతోంది. దుకాణాల వద్ద స్టాక్, ధరల బోర్డు పెట్టిన వారే లేరు.
అదనపు భారం
యూరియా కోసం వచ్చే రైతులకు వ్యాపారులు కొన్ని నిబంధనలు పెడుతున్నారు. ఇతర ఎరువులు కూడా కొనాల్సిందే అని బెదిరిస్తున్నారు. డీఏపీతోపాటు నానో యూరియాను తీసుకుంటేనే యూరియా విక్రయిస్తామని చెబుతున్నారు. అవసరం లేకున్నా అదనపు భారం మోయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు నెలకు 18,595 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 33 వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. ఇప్పటికే 11 వేల మెట్రిక్ టన్నుల వరకు విక్రయించాం. యూరియా కొరత అనేది అవాస్తవం. వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎం.జగ్గారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరతను వ్యాపారులు సృష్టించుకుండా ఆర్‌బీకేలు కీలకపాత్ర పోషించాయి. సీజన్‌కు అవసరమయ్యే ఎరువులను ఇక్కడే అందుబాటులో ఉంచేవారు. రైతులు నిశ్చింతగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే వారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుసేవా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. ఎరువులను కేటాయించకుండా కేవలం సొసైటీల ద్వారానే పంపిణీ చేస్తోంది. అధికార పార్టీ సానుభూతిపరులకే ఈ ఎరువులు అందుతున్నాయి. మిగతావారు దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
కూటమి పాలనలో అదనపు భారంతో అన్నదాతలు విలవిల
వ్యాపారులు చెప్పిన ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎక్కడా లేదు. గతంలో రూ.50 వరకు అధికంగా తీసుకునేవారు. ఇప్పుడు రెట్టింపు అయింది.
– చెంచయ్య, రైతు, గొనెపూడి
యూరియా కొరత ఉంది. ఇదే అదనుగా వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. పంపిణీపై ప్రభుత్వం పర్యవేక్షణ లేదు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి ఎరువులను అందుబాటులో ఉంచాలి.
– అన్నెం పున్నారెడ్డి, వైఎస్సార్‌సీపీ
రైతు విభాగం జిల్లా అద్యక్షుడు

రైతులపై యూరియా బాదుడు!

రైతులపై యూరియా బాదుడు!

రైతులపై యూరియా బాదుడు!