ఇంజినీరింగ్‌కు ఫుల్ డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్ : రెండో విడతలో మిగిలిన సీట్ల కౌన్సెలింగ్ కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చేపట్టిన ప్రక్రియ న్యాయస్థానం ఆదేశాలతో నిలిచిపోయింది. తెలంగాణలో ఇంటర్ చదివిన విద్యార్థుల స్థానికత నిర్ధారణ విషయం కొలిక్కిరావడంతో ఈ నెల 14న ఏపీ ఈఏపీసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు జాబితాను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 20లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని తెలిపింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఇప్పటికే దాదాపుగా కళాశాలల్లో చేరారు. తుది విడత నోటిఫికేషన్ ఆధారంగా కళాశాలల మార్పు, కొత్తగా ఆప్షన్ల నమోదు చేసుకున్న విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయ్యాక తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.
20 నుంచి తరగతులు
రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 20 నుంచి తరగతులను ప్రారంభించేందుకు కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చాలావరకు కళాశాలలతోపాటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా ఇప్పటికే ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. 36 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో అంటుబాటులో ఉన్న 30,240 సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అయినట్లు తెలుస్తోంది. ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రముఖ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ సహా అన్ని బ్రాంచ్‌లలో సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి. తృతీయ శ్రేణి కళాశాలల్లో సీఎస్‌ఈ మినహా మిగిలిన బ్రాంచ్‌లలో పరిమిత సంఖ్యలో సీట్లు మిగిలినట్లు ఆయా కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. కళాశాలల్లో సీట్ల భర్తీకి గతంలో మూడు, నాలుగు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం రెండు దశల్లోనే సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యాయి.
● ఉమ్మడి గుంటూరు జిల్లాలోని
ఇంజినీరింగ్ సీట్లు దాదాపు భర్తీ
● 36 కాలేజీల్లో తొలి విడత
కౌన్సెలింగ్‌లోనే 90 శాతానికిపైగా భర్తీ
● ప్రస్తుతం చివరి విడతలో
మిగతా సీట్ల భర్తీకి సన్నాహాలు
ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత ప్రక్రియ ముగిసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయిన ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించిన ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా మొదటి విడతలో ఇప్పటికే సీట్ల కేటాయింపు పూర్తయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 90 శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.