
‘నాన్‌స్టాప్’ అబద్ధాలు
అతివలకు
● ‘ఉచిత ప్రయాణం’ పేరిట
మహిళలకు మరో కుచ్చుటోపీ
● నరసరావుపేట డిపోలో
ఎక్స్‌ప్రెస్‌లు నాన్‌స్టాప్‌గా మార్పు
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ (సీ్త్ర శక్తి ) పథకం మరో మోసమని తేలిపోయింది. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు ఆయా సర్వీసుల్లో కేవలం పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాలు లేదా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం మహిళలకు వర్తింపచేసింది. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌లను నాన్‌స్టాప్‌గా మార్చి ఎక్కనీయడం లేదు. నరసరావుపేట డిపోలో పథకం అమలు తీరును పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం కుటిల వైఖరి వెల్లడవుతోంది. మొత్తం బస్సులు 84 ఉండగా... వీటిలో 20 అద్దె బస్సులు ఉన్నాయి. 40 పల్లె వెలుగు కాగా.. ఎక్స్‌ప్రెస్ బస్సులతో నరసరావుపేట–గుంటూరు నాన్‌స్టాప్ సర్వీసులను నడుపుతున్నారు. శ్రావణ మాసంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కావటంతో బస్సుల్లో రద్దీ అధికంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆరు బస్‌డిపోలు ఉండగా వాటిలో 489 బస్సులు ప్రజారవాణా చేస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌లు 73, పల్లెవెలుగు 325 బస్సులు ఉచిత ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయి. 91 బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదని అధికారులు చెప్పారు. కానీ ఎక్కువ బస్సులు నాన్‌స్టాప్ అని చెబుతూ అధికారులు ఎక్కనీయడం లేదని మహిళలు వాపోతున్నారు.