యానిమేషన్ స్కామ్ బాధితుల ఆవేదన తాము పోగొట్టుకున్న సొమ్ములో పదోశాతం సైతం లేదంటూ గగ్గోలు నిందితుల ఆస్తులు సైతం అటాచ్ చేయని పోలీసులు దారి మళ్లించిన డబ్బులపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు ఇన్ని రోజులు ఎదురుచూసినాబాధితులకు దక్కని న్యాయం సుమారు రూ.200 కోట్లు పోగొట్టుకున్న నరసరావుపేట వాసులు ఇప్పటికే ఈ కేసులో ఒకరు గుండెపోటుతో మృతి తమ డబ్బు ఇక రాదేమోనని కుంగిపోతున్న బాధితులు
నరసరావుపేట టౌన్: ఒక్కసారిగా ధనవంతులు కావాలంటే.. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలంటే నమ్మకమే పెట్టుబడి. అమాయకుల అత్యాశే రాబడి. ఇదే సూత్రాన్ని అమలు చేసి కొందరు మాయగాళ్లు.. జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ కోవలో మోసాలకు నరసరావుపేట కేంద్రంగా మారింది. కొన్ని నెలల కిందట బయటపడిన యానిమేషన్ స్కామ్‌లో బాధితులు అత్యధికంగా నరసరావుపేటలోనే ఉన్నారు. రూ.పది పెట్టుబడి పెడితే రూ.వంద వస్తాయని నమ్మబలకటంతో బాధితులంతా నమ్మి పెట్టుబడి పెట్టారు. ఇలా నరసరావుపేటలోనే సుమారు రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టి మోసపోయారు.
అధిక లాభాలకు ఆశపడి..
విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో గుంటూరుకు చెందిన మిట్టపల్లి రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజు నరసరావుపేటకి చెందిన ఓ ప్రముఖ బంగారం వ్యాపారి అల్లుడు. దీంతో అతనికి నరసరావుపేటలోని వ్యాపారులు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. యానిమేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి అనేక మందితో రూ.కోట్ల పెట్టుబడులు పెట్టించాడు. నిందితుడికి సమీప బంధువైన నరసరావుపేటకు చెందిన పొగాకు వ్యాపారి అతని మాటలు నమ్మి పెద్ద మొత్తంలో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి మోసపోయి దీవాళా తీశాడు. ఉన్న అస్తుల కంటే అప్పులే అధికంగా ఉండటంతో ఐపీ పెట్టే పరిస్థితికి వచ్చాడు. మరో బంగారం హోల్‌సేల్ వ్యాపారి కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. నిందితుడు మిట్టపల్లి రాజును శుక్రవారం నరసరావుపేటలోని అతని బావమరిది ఇంట్లో అదుపులోకి తీసుకున్న విజయవాడ పోలీసులు శనివారం అరెస్ట్ చూపారు. రాజు జనాల వద్ద దోచుకున్న డబ్బును అనేక రూపాల్లో దారి మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు. బంగారం, బినామీల పేరుతో ఆస్తులు కూడగట్టినట్టు సమాచారం. అయితే పోలీసులు వాటిపై దృష్టి సారించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
ఫిర్యాదు బెజవాడలో..
యానిమేషన్ స్కాంపై మొదట పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కేసు నమోదు అవ్వాల్సి ఉంది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు తొలుత నరసరావుపేట పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. అయితే ఈ స్కామ్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉందని, అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితులు విజయవాడ పోలీసులను సంప్రదించారు. అక్కడ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కేసు స్థాయినిబట్టి సిట్‌ను ఏర్పాటు చేయడంతో బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే పోలీసు విచారణ అనంతరం రికవరీని చూసిన బాధితులు నీరుగారిపోయారు.
పదోవంతు కూడా లేదు
యానిమేషన్ స్కాం మొత్తం రూ.400 కోట్ల దాకా ఉండగా అందులో నరసరావుపేటకు చెందిన అనేక మంది వ్యాపారుల సొమ్మే సుమారు రూ.200 కోట్ల వరకు ఉంది. తమ పెట్టుబడికి అధికంగా డబ్బులు వస్తాయని నమ్మారు. అయితే బోర్డు తిప్పేశాక వారంతా వేదనలో ఉన్నారు. చివరకు పోలీసులపై ఆశలు పెట్టుకుంటే.. వారు చేసిన రికవరీ అంతా కలిపినా కూడా పోగొట్టుకున్న దానిలో పదో వంతు కూడా లేదు. ఇదే కాకుండా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి ఆస్తులను పూర్తిస్థాయిలో అటాచ్ చేయలేదు. దీంతో తమకు న్యాయం ఎప్పుడు? ఎలా ? జరుగుతుందో తెలియక బాధితులు వేదన పడుతున్నారు.
పోగొట్టుకుంది కొండంత.. వసూలు గోరంత
ఒకటికి పది రెట్లు వస్తాయన్న ఆశతో యానిమేషన్ వలలో చిక్కుకున్న బాధితులకు న్యాయం అందని ద్రాక్షగానే మిగిలేలా ఉంది. ఇంతకాలం పోలీసులపై పెట్టుకున్న నమ్మకం తాజాగా అరెస్టులతో నీరుగారింది. నష్టం రూ.వందల కోట్లలో ఉంటే రికవరీ మాత్రం అందులో పది శాతం కూడా లేకపోవడం గమనార్హం. రూపాయి రూపాయి కూడగట్టిన సొమ్ము నమ్మకంగా పెట్టుబడి పెడితే నట్టేట మునిగిపోయామనే దిగులు నిలువెల్లా కుంగదీస్తోంది. ఇప్పటికే ఈ స్కాముకు ఒకరు బలికాగా.. మిగతావారు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.
స్కాంలకు కేంద్రం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరసరావుపేట స్కాముల కేంద్రంగా మారింది. ఇక్కడ పుల్లారావు సాయిసాధన చిట్ ఫండ్ పేరిట భారీగా వసూళ్లు చేసి బోర్డు తిప్పేశాడు. పోలీసులు ఈ కేసులో హడావుడి చేసి చివరకు బాధితులను వదిలేశారు. బాధితులు సీఎం చంద్రబాబు నాయుడును కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. యానిమేషన్ స్కాములోనూ అత్యధిక మంది నరసరావుపేట వాసులే ఉన్నారు. వీరు కూడా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి న్యాయం కోసం వేడుకున్నా.. చివరకు అన్యాయమే జరిగిందని గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటికే ఓ బాధితుడు మోసాన్ని భరించలేక గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. రికవరీ జరుగుతుంది.. తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులు తాజా పరిణామాలతో ఢీలాపడ్డారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే అనేకమంది బాఽధితులు నేడు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.
ఇంతేనా.. రికవర్రీ!