
నిందితుడు టీడీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయట్లేదు
రెండోసారి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
నరసరావుపేట రూరల్: తనపై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, పైగా.. ‘నిందితుడికి రాజకీయ పలుకుబడి, ధన బలం ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసారు. రాజీ చేసుకుంటే మంచిది’.. అని వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్ బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన బాధిత దళిత మహిళ కన్నీటిపర్యంతమైంది.
తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి విన్నవించుకునేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆమె రెండోసారి వచ్చింది. తొలుత.. ఈనెల 11న జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె. శ్రీనివాసరావుకు ఆమె ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కానీ, విచారణ పేరుతో తనను వినుకొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన అక్కడి సీఐ ప్రభాకర్ నిందితుడు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయకపోగా రాజీ చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని.. అందుకు తాను అంగీకరించలేదని బాధితురాలు తెలిపింది.