
పల్నాడు జిల్లా: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి బతకాలనుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించకపోవటంతో వేర్వేరు రైళ్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోడె గోపి(20), గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన ప్రియాంక (20) గుంటూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
కానీ కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పడంతో పెళ్లి చేసుకున్నారు. దీనిని వారి పెద్దలు అంగీకరించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపి.. శనివారం సాయంత్రం పేరేచర్ల సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక కూడా ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యువతి తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో.. గోపి కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని కూడా దమ్మాలపాడుకు తీసుకువచ్చారు. ఇద్దరికీ అంత్యక్రియలు పూర్తి చేశారు.