కల్కి అలంకరణలో వైకుంఠవాసుడు
తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని శ్రీ కల్కి అవతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరారామంలో మంగళవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వారదర్శనం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం వేకువజామున స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. అనంతరం స్వామివారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్థానిక కోదండరామాలయం, పాండురంగస్వామి ఆలయం, గీతామందిరంతోపాటుగా మండల పరిధిలోని వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో కూడా భక్తులకు ఉత్తరద్వార దర్శనం నిర్వహిస్తున్నట్లు ఆయా దేవాలయాల నిర్వాహకులు తెలిపారు.
గుంటూరు వెస్ట్: సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శనను విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సారస్ కార్యక్రమాన్ని జనవరి 6వ తేదీ నుంచి 18 వరకు గుంటూరు–నరసరావుపేట రోడ్డులోని రెడ్డి కళాశాల ఎదుట ఉన్న స్థలంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే చేనేత, హస్తకళలు, ఇతర సామగ్రిని ప్రదర్శించడం, విక్రయించడం జరుగుతుందన్నారు. ఇది మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనాన్ని తలపిస్తుందని చెప్పారు. 250కు పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన తలనీలాలకు రికార్డు ధర పలికాయి. ఏడాదికి రూ. 10.10 కోట్లకు తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ టెండర్‌ను దక్కించుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం టెండర్ ప్రక్రియను నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీకి చెందిన మొత్తం 19 మంది కాంట్రాక్టర్లు ఒక్కొక్కరూ రూ.50 లక్షల ప్రథమ దరావత్తుగా చెల్లించి వేలంలో పాల్గొన్నారు. రెండేళ్ల కాల పరిమితికి దేవస్థానం టెండర్లు ఆహ్వానించగా, కాంట్రాక్టర్ మొదటి ఏడాది మొత్తంపై 10 శాతం పెంపుతో రెండో ఏడాది టెండర్ కొనసాగింపు జరుగుతుందని టెండర్ నిబంధనల్లో పొందుపరిచారు.
కల్కి అలంకరణలో వైకుంఠవాసుడు
కల్కి అలంకరణలో వైకుంఠవాసుడు


