రెవెన్యూ క్లినిక్‌తో సమస్యల పరిష్కారం
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: జిల్లాలో రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. తెనాలి, గుంటూరు రెవెన్యూ డివిజన్ సంబంధించి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, 18 మంది మండలాల తహసీల్దార్లు , రెవెన్యూ ఉద్యోగులు రికార్డులతో హాజరయ్యారు. అడంగల్‌లో విస్తీర్ణం మార్పుచేర్పులు, భూ స్వభావ మార్పులు, 22ఏ నుంచి తొలగింపులు, హద్దురాళ్ల ఏర్పాటు, మ్యూటేషన్లకు సంబంధించి మొత్తం 40 అర్జీలను ప్రజలు అందించారు. వీటిని ఆన్‌లైన్లోనే సిబ్బంది వెంటనే నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్‌లో అందించిన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన 348 అర్జీలను కలెక్టర్‌తోపాటు డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా అధికారులు పరిశీలించారు.


