కర్షకులకు కష్ట కాలం..!
రైతులకు తీవ్ర అన్యాయం
ఆర్‌ఎస్‌కేలు నిరుపయోగం
వరుస తుపాన్లు, అధిక వర్షాలతో తగ్గిన దిగుబడులు చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో కష్టాలు రెట్టింపు విత్తనం నుంచి ఎరువు, గిట్టుబాటు ధర వరకు అన్నీ అవస్థలే
తుపాన్లతో ఆశలు ఆవిరి
ఈ ఏడాదంతా రైతులకు తప్పని నష్టాలు
కొరిటెపాడు (గుంటూరు): పట్టెడన్నం పెట్టే రైతన్నలకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. పంట ఎక్కడైనా కాస్త పండితే గిట్టుబాటు ధర లేదు. ఖరీఫ్, రబీ సీజన్లలోనూ కష్టాలు తప్పలేదు. ప్రకృతి కన్నెర్రతో పంటలన్నీ వర్షార్పణం అయ్యాయి. వరుస తుపాన్లు, అధిక వర్షాలతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో మన్ని ఇబ్బందులు తప్పలేదు.
ఖరీఫ్ సీజన్‌లో అధిక వర్షాలు, తుపాన్లు రైతులను నిండా ముంచాయి. పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడంతో మరింత నష్టపోవాల్సి వచ్చింది. రబీ సీజన్‌లో సకాలంలో వర్షాలు లేక సాగు మందకొడిగా సాగుతోంది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది రైతులకు సరిగా కలిసి రాలేదు.
సాగు ఆరంభం నుంచి కష్టాలు..
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రైతుల్ని కష్టాలు వెంటాడాయి. జిల్లాలో 2,15,701 ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌లో సాధారణ పంటలు, మరో 40 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేశారు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ఎద్దడితో తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా చోట్ల వెద పెట్టిన వరి కుళ్లిపోయింది. సుమారు 75 వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తీరా అంచనా వేసిన తర్వాత చివరికి నష్టం ఏమీ జరగలేదని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
నాటి వ్యవస్థ నిర్వీర్యం..
విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే వాటి పేర్లను రైతు సేవ కేంద్రాలుగా మార్చింది. పేరుకు తగ్గ సేవ మాత్రం అందించలేక పోయింది. దీనికితోడు క్రమబద్ధీకరణ పేరుతో కొన్ని కేంద్రాలను మూసివేసింది. మిగిలిన వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీంతో లక్ష్యం నీరుగారిపోయింది.
ఉచిత పంటల బీమాకు మంగళం..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రీమియం భారాన్ని రైతులే మోయాల్సి వచ్చింది. గడువు తెలియక చాలా మంది రైతులు సకాలంలో చెల్లించలేక పోయారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే ప్రీమియం మొత్తం చెల్లించింది. అన్నదాతలు ఎలాంటి దిగులు లేకుండా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ధాన్యం, పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరగలేదు. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేశారు. వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. మిర్చి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా దిగజారిపోయాయి. దీనికి తోడు సాధారణ రైతులలో చాలా మందికి అన్నదాత సుఖీభవ నిధులు రాలేదు. కౌలు రైతులకు మొండిచేయి చూపించారు.
యూరియా కోసం పాట్లు..
ఖరీఫ్ సీజన్‌లో చాలా చోట్ల రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా షాపులు, రైతు సేవ కేంద్రాలు, సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. అది సరిపోక బ్లాక్‌లో కొందామంటే దొరకలేదు. ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం సరిగా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. చివరకు కొంతమంది రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేసి అవసరాలను తీర్చుకున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. అన్నదాత సుఖీభవ కొందరికి తప్ప ఏ పథకమూ ఇవ్వడం లేదు. అదీ తొలి ఏడాది ఎగనామం పెట్టారు. ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా ఇవ్వలేదు. అదే జగన్ హయాంలో ఎంతగానో భరోసా లభించింది. రైతు భరోసా కింద ఏటా రూ.13,500, ఉచిత పంటల బీమా కింద రూ.1.10 లక్షల పరిహారం జమయ్యాయి. గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో రైతులకు స్వర్ణయుగం.
–పేరం కృష్ణారెడ్డి, గుంటూరు రూరల్
వైఎస్ జగన్ హయాంలో రైతుల కోసం ఊరూరా కట్టించిన రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వ్యవసాయ సేవలను తగ్గించడంతో ఆర్‌ఎస్‌కేలకు వెళ్లడం మానేశాం. గతంలో సీజన్ మొదలవగానే రాయితీ విత్తనాలు, అవసరమైన ఎరువులు, యంత్ర పరికరాలు, ఇతర అన్ని రకాల పథకాలు, కార్యక్రమాలు ఆర్‌బీకేవేదికగానే నిర్వహించే వారు. ఇప్పుడు నామమాత్రం చేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ పథకాలు లేకపోవడం, పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం కనికరం చూపడం లేదు.
– టి.వెంకటస్వామి, రైతు
పంట చేతికి వచ్చే సమయంలో సంభవించిన మోంథా తుపాను రైతుల ఆశలను ఊడ్చిపడేసింది. పంటలు దెబ్బతిని రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. జిల్లాలో సుమారు 1.09 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా తక్కువగా చూపి చివరికి కేవలం 6,062.21 ఎకరాల్లో మాత్రమే వరి, పత్తి, మినుము, సోయాబీన్, కంది, అరటి, కూరగాయలు, తమలపాకు, పూలు పంటలు దెబ్బతిన్నట్లు తేల్చేసింది. దీంతో రైతులు కోలేకోలేని విధంగా నష్టపోయారు. అధిక వర్షాలు, తెగుళ్లు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. మిర్చి దిగుబడి 10 క్వింటాళ్లకు పడిపోగా, పత్తి ఎకరాకు కేవలం 6 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వరి కూడా 25 క్వింటాళ్లకు మించి రాని పరిస్థితి నెలకొంది.
కర్షకులకు కష్ట కాలం..!
కర్షకులకు కష్ట కాలం..!


