
పల్నాడు జిల్లా: అచ్చంపేటలో ఓ వ్యక్తి మృతి చెందడం వెనుక కల్తీ మద్యం కారణం అయ్యి ఉండొచ్చని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ అచ్చంపేట మరణం దురదృష్టకరం. బెల్ట్ షాపులో లిక్కర్ తాగిన తర్వాత వాందులు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం. ఆ మరణానికి కల్తీ మద్యం సేవించడం కారణం కావొచ్చనేది మా అనమానం.
వైద్య సిబ్బందిపై నెట్టేసి, మసిపూసి మారేడు కాయ చేయడం మంచిది కాదు. హాస్పిటల్స్ ఉండాల్సిన డాక్టర్లు లేకపోతే చర్యలు తీసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరణానికి అసలు కారణం దాచే ప్రయత్నం మంచిది కాదు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
కాగా, పల్నాడు జిల్లాలోని అచ్చంపేట ముస్లిం కాలనీకి చెందిన షేక్ మాదిపాడు నాగులును అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతన్ని అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే అక్కడ సరైన వైద్యం అందక నాగులు మృతిచెందాడని ఒకవైపు ఆందోళణ వ్యక్తమవుతున్న సమయంలోనే లిక్కర్ తాగిన తర్వాతే నాగులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడని స్థానికలు చెబుతున్నారు.