జననేత జనరంజక పాలన దేశానికే ఆదర్శం
విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
నాడు–నేడు ద్వారా పాఠశాలలకు కొత్తరూపు
సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు
ఆరోగ్యశ్రీ ద్వారా పేదోడికి నాణ్యమైన వైద్యం
సాక్షి, విశాఖపట్నం : ప్రజా సంక్షేమమే పరమావధిగా.. అభివృద్ధే లక్ష్యంగా సాగిన అపూర్వ పాలన అది. కులం చూడకుండా, మతం అడగకుండా, రాజకీయ రంగులతో సంబంధం లేకుండా అర్హతే ప్రాతిపదికగా ప్రతి ఇంటా సంక్షేమ జ్యోతిని వెలిగించిన ధీశాలి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కరోనా వంటి మహమ్మారి కమ్మేసినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. తలవంచకుండా నవరత్నాల రథాన్ని దిగి్వజయంగా ముందుకు నడిపించి, పేదోడి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా, డిజిటల్ విద్యకు నాంది పలికి భావితరాల భవిష్యత్తుకు బాటలు వేశారు. సచివాలయ వ్యవస్థతో పాలనను గడప వద్దకే చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చిన ప్రజా నాయకుడు ఆయన. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పాలనలో లబి్ధపొందిన వారు తమ అభిమాన నాయకుడితో ఉన్న అనుబంధాన్ని, పొందిన మేలును గుర్తు చేసుకుంటున్నారు.
నేడు వైఎస్ జగన్ బర్త్‌డే వేడుకలు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో పార్టీ యువజన విభాగం ప్రతినిధులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని, జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, పార్టీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కుటుంబమంతా రుణపడి ఉంటాం..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన పథకాలు నా సోదరి అంబటి అచ్చుత కుటుంబంతో పాటు నాకు ఎంతగానో చేదోడుగా నిలిచాయి. వాటి సహకారంతోనే సమస్యలకు ఎదురొడ్డి నిలబడ్డాం. అచ్చుత భర్త 2019లో చనిపోగా వితంతు పింఛన్ లభించింది. దీంతో పాటు అమ్మఒడి పథకం ద్వారా ఆమె ఇద్దరు పిల్లల చదువు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకుసాగింది. అచ్చుతకు గత జగనన్న ప్రభుత్వం శొంఠాంలో ఇల్లు సైతం కేటాయించింది. దీంతోపాటు ఒంటరిగా ఉన్న దివ్యాంగుడునైన నాకు దివ్యాంగ పెన్షన్ లభించింది. దబ్బందలో టిడ్కో ఇల్లు మంజూరైంది. తద్వారా దశాబ్దాల సొంతింటి కల జగన్ ద్వారా నెరవేరింది. అందుకే మా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన నిండినూరేళ్లు చల్లగా ఉండాలి.
– సోదరితో కుప్పల రమేష్, ఎంవీపీ కాలనీ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదవగలిగాను..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో డిప్లమో చదవగలిగాను. మేము విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతం నుంచి వచ్చి ఆరిలోవ ప్రాంతం సూర్యతేజానగర్‌లో నివాసం ఉంటున్నాం. మా నాన్న గ్యాస్‌బాయ్‌గా పనిచేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మధురవాడ దరి ఓ కళాశాలలో 2020–23 బ్యాచ్‌లో డిప్లమోలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఐటీ సెజ్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉన్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాలాంటి ఎంతోమంది ఉన్నత విద్యకు దోహదపడ్డారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
– తామరసెల్లి చైతన్య, ఆరిలోవ

జగన్ పాలనలో సాగుకు స్వర్ణయుగం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన రైతుకు స్వర్ణయుగమని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారు. నేను 70 సెంట్లలో పూలతోటలు సాగుచేస్తున్నాను. అప్పటి అయిదేళ్లు ఠంచనుగా పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ.13,500 వంతున అందింది. ఇప్పుడేమే అన్నదాత సుఖీభవ రెండేళ్లలో ఒక్కసారే రూ.5వేలు వచ్చింది. ప్రస్తుతం పంటల బీమా లేకపోవడంతో ఇటీవల మోంథా తుపానుకు పూలతోటలు పాడైనా నష్టపరిహారం రాలేదు. జగన్ పాలనలో గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలు, పంటల బీమా, ఎరువులు, పురుగు మందులు ఏ రైతూ వీటి కోసం ఎదురు చూడకుండానే అందించారు. దీంతో పంటలు బాగా సాగి ఆదాయానికి లోటు ఉండేది కాదు.
– కొయ్య ఈశ్వరరావు, తాటితూరు, భీమిలి మండలం
అప్పట్లో రైతుల చుట్టూ అధికారులు చక్కర్లు
వైఎస్ జగన్ సీఎంగా ఉండగా అధికారులు గ్రామాల్లో ఉండి రైతుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. మట్టి శాంపిళ్ల నుంచి ఏ పంట వేయాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలి, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతు భరోసా కేంద్రాలలో ఉంచిన కియోస్క్‌ల ద్వారా సాగుకు ముందే అందుబాటులో ఉంచేవారు. చంద్రబాబు పాలనలో రైతులకు యూరియా కూడా అందుబాటులో లేకుండా పోయింది. మేము 50 సెంట్లు సొంత భూమితో పాటు మరో రెండు ఎకరాలు లీజుకు తీసుకుని వరిసాగు చేస్తే పంట కొనుగోలు ఆలస్యమైంది. చివరకు ప్రభుత్వం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోయింది. మోంథా తుపాను కారణంగా పంటకు నష్టం కలిగితే అధికారులు కనీసం చూడనైనా చూడలేదు.
– పిన్నింటి అప్పలసూరి, మజ్జివలస, భీమిలి మండలం
జగన్ మామయ్య పాలన బాగా చేశారు..
నా పేరు బమ్మిడి యోగిత. నాన్న కృష్ణ చికెన్ షాప్ నడుపుతారు. అమ్మ పుష్ప గృహిణి. తొలి నుంచీ నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నాను. ఐదేళ్ల క్రితం మా స్కూల్‌కి సరిగా బెంచీలు కూడా లేవు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ మామయ్య మా స్కూల్‌కి చాలా చేశారు. కొత్త బెంచీలు, రూమ్‌లు ఇచ్చారు. స్కూల్లో అన్నీ బాగు చేయడంతో నా చదువు కూడా మెరుగుపడింది. జగన్ మామయ్య స్ఫూర్తితో బాగా చదువుకుని డాక్టర్‌ను అవుతాను. అమ్మానాన్న కష్టానికి మంచి గిఫ్ట్ ఇస్తాను.


