వచ్చేది జగనే.. ఇచ్చేదీ జగనే!
నేడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం
సాక్షి, నరసరావుపేట: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి... అంటేనే అభివృద్ధి, సంక్షేమాలకు మారుపేరుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తన ఐదేళ్ల పరిపాలనతో చరిత్రలో మరే ముఖ్యమంత్రి చేయలేని పనులు చేసి ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. కులమత, వర్గ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించిన ప్రజాపాలన ఆయనకే ప్రత్యేకమైంది. పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో కీలకమైన ప్రభుత్వ విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు చేపట్టి మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చారు. రైతు పక్షపాతిగా విత్తనాలు మొదలు పండిన పంట అమ్ముకునే వరకు ప్రతి దశలో వారికి చేదోడుగా నిలిచారు. లాభాల సాగుకు సాయం చేశారు. గ్రామాలలో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, ప్రభుత్వ బడుల అభివృద్ధి, రైతులకు గోదాములు వంటి పనులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. కరోనా వంటి విపత్తులో సైతం ప్రజలకు భరోసానిచ్చారు. మహిళలు స్వయంశక్తితో నిలబడేలా చేయూత ఇచ్చారు. ఐదేళ్లలో లెక్క లేనన్ని మంచి పనులు చేసి వందేళ్లు గుర్తుంచుకునేలా పాలించారు. నేడు ఆయన జన్మదినం కావడంతో జిల్లా ప్రజలు పొందిన లబ్ధిని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా పుట్టిన రోజు వేడుకలు చేయడానికి వాడవాడలా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధమయ్యారు.
వైద్య విప్లవం...
విద్య, వైద్యానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా పిడుగురాళ్ల కామేపల్లి శివారులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ. 550 కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసరావుపేటలో 200 పడకల ప్రభుత్వ జిల్లా వైద్యశాల గత ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగి పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాయి. ఆయన కృషిని నేటికీ గుర్తు ఉంచుకున్నారు.


