ప్రాణాలు నిలబెట్టిన నాటి ముఖ్యమంత్రి భరోసా
యడ్లపాడు: ఒక నిరుపేద యువకుడికి అమ్మ త్యాగం.. వైఎస్ జగన్ సాయం ప్రాణం పోశాయి. పల్నాడు జిల్లా యడ్లపాడు దిగువ ఎస్సీ కాలనీకి చెందిన కారుచోల ఏసుపాదం, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. 15 ఏళ్ల క్రితమే ఏసుపాదం మరణించారు. కుటుంబ భారం రాణిపై పడింది. కూలి పనులు చేస్తూ బిడ్డలను సాకుతోంది. తల్లి కష్టాన్ని చూడలేక శ్రీనివాస్ ఇంటర్‌తోనే చదువు ఆపేసి, గ్లాస్ వర్కింగ్ పనులకు వెళ్లాడు. కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో సాధారణ జ్వరంతో అనారోగ్యం మొదలైంది. పరీక్షల సమయంలో శ్రీనివాస్ కిడ్నీ దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
స్పందించిన వైఎస్ జగన్
ఆపరేషన్ కోసం రూ. 7 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఉన్న 30 సెంట్ల పొలాన్ని అమ్ముకున్నారు. అయినా డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ విషయం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 5 లక్షలు మంజూరు చేశారు. తల్లి తన కిడ్నీని కొడుకుకు దానం చేయగా, ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ తర్వాత వారు బరువైన పనులు చేసే పరిస్థితి లేకపోవడంతో శ్రీనివాస్‌కు ఎడ్లపాడు గ్రామ పంచాయతీలో శానిటరీ సూపర్‌వైజర్‌గా, తల్లి రాణిని క్లాప్‌మిత్రగా నియమించి ఉపాధి కల్పించారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదుకోకపోతే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవి కావని, పొలం అమ్మినా ఆపరేషన్ ఖర్చులకు డబ్బుల్లేక అల్లాడిపోయామని రాణి గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు. జగనన్న చొరవతో తన కొడుకు కళ్ల ముందు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. తమ కుటుంబాన్ని జగన్ దేవుడిలా ఆదుకున్నారని తెలిపారు.


