
పల్నాడు జిల్లాలో ఆగని బాల్య వివాహాలు
ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రేమ పెళ్లిళ్ల భయం
చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు
జిల్లాలో 109 బాల్య వివాహాలు అడ్డుకున్న అధికారులు
సత్తెనపల్లిలో 14 మందిపై కేసు నమోదు
బాల్య వివాహాలతో చిన్నారులు అనారోగ్యం బారిన పడతారు. పలు అనర్థాలకు దారి తీస్తాయి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలనేది నిబంధన. ఆ వయసు నిండకుండా చేయడం నేరం. బాధ్యులపై గరిష్టంగా రెండేళ్లు జైలు, రూ. లక్ష వరకు జరిమానా లేదా రెండు అమలు చేసే వీలుంది. అయితే, ఇటీవల తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు చిన్న వయసులోనే వివాహం చేసి బరువు దించేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు, ప్రేమ పెళ్లిళ్లనే భయంతో మరికొందరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి. 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు 109 బాల్య వివాహాలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా హామీ (బైండోవర్ లెటర్) తీసుకున్నారు. అయినా, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ఇలా అధికారుల ఆదేశాలు ధిక్కరించి మూడు బాల్య వివాహాలు జరగడంతో వారిపై పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సత్తెనపల్లిలోని ధోబీఘాట్‌లో ఆగస్టు 3న బాల్య వివాహం జరిగింది.
దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కేర్‌కు ఫిర్యాదు కూడా వచ్చింది. విషయాన్ని గత నెల 23న చైల్డ్ వెల్ఫేర్ కేర్ ప్రతినిధి యర్రసాని ప్రశాంత్ కుమార్ సత్తెనపల్లి 4వ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గరికె కల్పన దృష్టికి తెచ్చారు. దీనిపై ఆమె విచారణ చేయడంతో వాస్తవమే అని తేలింది. వధూవరులతో పాటు ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు, వివాహం జరిపిన పూజారి, కల్యాణ మండపం నిర్వాహకుడు, ఫొటోగ్రాఫర్.. ఇలా మొత్తం 14 మందిపై బాల్య వివాహ చట్టం కింద పట్టణ ఎస్‌ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేశారు.
బాల్య వివాహంతో దుష్ఫలితాలు...
⇒ చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో శిశువు మరణించడం లేదా తీవ్ర అనారోగ్య సమస్యలతో పుట్టే ప్రమాదం ఉంది.
⇒ గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ
⇒ రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది
⇒ పోషకాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలు ఎదురవుతాయి
⇒ వివాహం తరువాత చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి
బాల్య వివాహాలతో అనర్థం
బాల్య వివాహాలతో అనర్థాలే ఎక్కువ. గర్భం దాల్చిన బాలికలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. బిడ్డను మోసే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లి ప్రాణానికీ ప్రమాదమే. ఒకవేళ బిడ్డ జని్మంచినా బరువు తక్కువగా ఉండడం, అనేక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పల్నాడు