
పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్‌లో వచ్చిన రోశమ్మ
కలెక్టర్, ఎస్పీకి వృద్ధురాలు వినతి.. ఆమె ఎకరంన్నర
స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం
ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి బాధితురాలు ఫిర్యాదు
కలెక్టర్, ఎస్పీకి వృద్ధురాలు వినతి
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతల ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పల్నాడు జిల్లాలో సోమవారం ఓ వృద్ధురాలు ఫిర్యాదుతో వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాలివీ.. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పల్నాడు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తుల రోశమ్మ (70) ఎస్పీ కె. శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేసింది.
తనకు రాష్ట్ర ప్రభుత్వం 2006లో నిరుపేదల కోటా కింద 1.50 ఎకరాల పట్టా భూమిని ఇచ్చిందని.. ఈ భూమి పక్కనే టీడీపీ మహిళ నాయకురాలు చల్లా అనువకళ భూమి కూడా ఉందని ఆమె చెప్పింది. అయితే, తన భర్త అనారోగ్యంతో చనిపోవడం.. ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడం.. కుమారుడికి మతిస్థిమితం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని తన భూమిని ఆక్రమించుకునేందుకు ఓ పత్రికా విలేకరి సాయంతో అనువకళ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేధించడం ప్రారంభించిందని.. భూమిలోకి వస్తే చంపుతామని కూడా బెదిరించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేగాక.. జూలై 30న అనువకళ, మరికొందరు కలిసి తనపై దాడిచేశారని.. కాలు విరిగి తీవ్రంగా గాయపడడంతో తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రోశమ్మ వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ పదిరోజులుగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కుమార్తె రమాదేవి, మనవడు సాయిరాం సాయంతో రోశమ్మ సోమవారం అంబులెన్స్‌లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. అనువకళతో పాటు ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తనను కాపాడాలని ఎస్పీని కోరింది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు కూడా అర్జీని అందజేశారు.