మెగా పీటీఎం అట్టర్ ఫ్లాప్
సమావేశంలో చర్చకు రాని విద్యార్థుల పురోగతి అన్ని చోట్లా గైర్హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టానుసార సమావేశాలు
చంద్రబాబు ప్రభుత్వ ప్రచారం తప్ప ఒరిగిందేమీ లేదు
నరసరావుపేట లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ పాఠశాలలో 1,200 మంది విద్యార్థులు ఉండగా, పదుల సంఖ్యలో మాత్రమే తల్లిదండ్రులు సమావేశానికి హాజరయ్యారు.
సత్తెనపల్లిలో సమావేశానికి హాజరు కావాలని గురువారం చెప్పినప్పటికీ శుక్రవారం మళ్లీ ఆహ్వానించలేదని ఇటీవల టీడీపీలోకి వెళ్లిన ఓ కౌన్సిలర్ భర్త ప్రొటోకాల్ తెలియదా అంటూ ఉపాధ్యాయులపై మండిపడ్డాడు.
పెదకూరపాడులోని ఎంపీపీఎస్ జేబీ పాఠశాల నందు 40 మంది విద్యార్థులు ఉండగా పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులను మినహాయిస్తే కేవలం ఏడుగురు, ముప్పాళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మొత్తం 390కి పైగా విద్యార్థులు ఉండగా కేవలం 70 మంది హాజరయ్యారు.
అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో 585 మంది విద్యార్థులకు గాను 240 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు.
కారంపూడి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో కరెంటు పోయినప్పుడు నీటికి ఇబ్బందిగా ఉందని, చెడి పోయిన బోరును మరమ్మతు చేయాలని కోరారు.
లక్ష్మీచెన్నకేశవ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరారు. కాకానివారిపాలెం ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉందని తరగతి గదులకు నూతన భవనం నిర్మించాలని కోరారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చంద్రబాబు ప్రభుత్వం శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పీటీఎం 3.0 అట్టర్ ప్లాపైంది. బాబు ప్రచారం కోసమే నిర్వహించినట్లు ఉందని విద్యావేత్తలు పెదవివిరిచారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల పురోగతి వంటి అంశాలు మచ్చుకై నా కనిపించలేదన్నారు. టీడీపీ ప్రచారం కోసమే ఈ సమావేశాలను పావుగా వాడుకున్నారన్న విమర్శ వచ్చింది. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో గైర్హాజరు కావడంతో ఏదో నిర్వహించమనే ధోరణిలో అధికారులు, ఉపాధ్యాయులు చేతులు దులుపుకున్నారు.
ఇదిగో ఇలా..
సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా 1,568 ప్రభుత్వ పాఠశాలలు, 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 3.0 సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటం మినహా ఇంకేమీ కనిపించని పరిస్థితి. ఈ సమావేశం ఉద్దేశాన్ని పూర్తిగా నీరు గార్చేశారు. బాబు సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో విద్యాభివృద్ధికి చేసిందేమీ లేదు. అభివృద్ధి దిశగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులను నిర్వీర్యం చేశారు. తల్లికి వందనం జమ కాకపోవడంతో .. ఇవన్నీ తల్లిదండ్రులు ప్రశ్నిస్తారోనని ఏమార్చేందుకు ప్రచార స్టంట్ కోసం మెగా పీటీఎం 3.0 ను నిర్వహించారనే విమర్శలు గుప్పుమన్నాయి.
మొక్కుబడి పోటీలు తప్ప .. సాగని చర్చలు
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ సమావేశాలు మొదలు పెట్టినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆటల పోటీలు, నృత్యాలు, కరాటే వంటివి చేయించారు. విద్యార్థులు విద్యలో ఎలా రాణిస్తున్నారు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు, వారి అభ్యున్నతికి చేపట్టే చర్యలు ఏమిటి, పాఠశాల, కళాశాల అభివృద్ధికి చేయాల్సిన పనులేమిటి ఇలా పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఈ దిశగా చర్చలు జరగని పరిస్థితి కనిపించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగాలు చేసి వెళ్లి పోయారు. దాదాపు 90 శాతం పైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల పురోగతిని తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను సైతం కొన్ని పాఠశాలల్లో ఇవ్వని పరిస్థితి నెలకొంది.
తల్లిదండ్రులు అధికంగా గైర్హాజరు...
జిల్లాలోని 1,568 ప్రభుత్వ పాఠశాలలు, 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే 1,554 ప్రభుత్వ పాఠశాలలు, 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రమే నిర్వహించగా, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వీటి జాడే కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,40,761 విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,821 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరితో పాటు వారి తల్లిదండ్రులు హాజరు కావాల్సి ఉంది. అయితే జిల్లాలో స్వల్ప సంఖ్యలోనే తల్లిదండ్రులు హాజరయ్యారు.
మెగా పీటీఎం అట్టర్ ఫ్లాప్


