అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలిని తొలగించిన సీడీపీఓ
మనస్తాపంతో అంగన్‌వాడీ కార్యకర్త హైమావతి నిద్రమాత్రలు మింగి
ఆత్మహత్యకు యత్నం
ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో
చికిత్స
సత్తెనపల్లి: అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల సెక్టార్ కట్టమూరు ఎస్సీ–2 అంగన్‌వాడీ కేంద్రంలో గత నెల 6న ఆయా నాగప్రసన్న వెనుక వైపు నుంచి వచ్చిన పాప సాంబార్ గిన్నెకు తగలగా సాంబార్ నేలపై దొర్లడంతో అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్న పాప బేబీ తమ్మిడి హారిక పడటంతో బొబ్బలు వచ్చాయి. ఈ విషయాన్ని వెంటనే హారిక తల్లిదండ్రులు తమ్మిడి నాగలక్ష్మి, శ్రీనులకు తెలియపరచి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిని విచారణ జరిపారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. నియమ నిబంధనల మేరకు అంగన్‌వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతి, అంగన్‌వాడీ సహాయకురాలు ఈ నాగప్రసన్న జాబ్ చార్ట్ ప్రకారం ఆహార, భద్రత, శుభ్రత నియమాలు పాటించలేదని విచారణలో రుజువు కావడంతో వారిరువురిని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కట్టమూరు ఎస్సీ–2 అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతి, సహాయకురాలు ఈపూరి నాగప్రసన్నలను విధుల నుంచి తొలగిస్తూ సత్తెనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ టి శ్రీలత జారీ చేసిన ఉత్తర్వులను సెక్టార్ సూపర్‌వైజర్ షేక్ ఆషా గురువారం కట్టమూరు ఎస్సీ–2 అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ఉత్తర్వులు అందజేయడంతో కార్యకర్త హైమావతి, ఆయా నాగప్రసన్నలు స్వీకరించలేదు. అంగన్‌వాడీ కేంద్రానికి, వారి గృహలకు ఉత్తర్వుల కాపీని అంటించారు. అంగన్‌వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతి మనస్తాపానికి గురైంది. దీనికి తోడు గ్రామానికి చెందిన చుట్టుపక్కల మహిళలు హేళనగా మాట్లాడటంతో మరింత అవమానంగా భావించి ఆమె గురువారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమెను హుటాహుటీన సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉండటంతో వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు.
టీడీపీ స్థానిక నేతల వేధింపులు
అంగన్‌వాడీ కార్యకర్త సీహెచ్ హైమావతిని తొలగించేందుకు స్థానిక టీడీపీ నేతలు కొంతకాలంగా పథకం ప్రకారం వేధిస్తున్నట్లు సమాచారం. పొరపాటున సాంబార్‌లో చిన్నారి హారిక పడిన విషయాన్ని గ్రామానికి చెందిన ఇరువురు టీడీపీ నాయకులు 1098 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. మెమో జారీ చేసి సంజాయిషీ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ పదేపదే ఆ నంబరుకు ఫోన్ చేసి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ టీడీపీ నాయకులు కోరడంతో తప్పని పరిస్థితుల్లో వారు ఇరువురిని తొలగించినట్లు తెలుస్తోంది. తమకు చెందిన వారిని నియమించుకునేందుకు టీడీపీ నేతలు ఈ వ్యవహారం నడిపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి జరిగిన ఘటన పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే ఉద్యమిస్తామని చెప్పారు.


