
నేడు, రేపు మంగళగిరిలో సీఎం పర్యటన
మంగళగిరి టౌన్: మంగళగిరిలో మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం అధికారులతో కలసి పరిశీలించారు. నగర పరిధిలోని సీకే కన్వెన్షన్‌లో జీరో ప్రావర్టీ పి–4 కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. సీటింగ్, సభాస్థలి, వీడియో గ్యాలరీ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నగర పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ ఫ్‌లైఓవర్ వద్ద ఉన్న మయూరి టెక్ పార్క్‌లో బుధవారం జరగనున్న రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న దృష్ట్యా, అక్కడి ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ శంకరరావు, సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, సీఎంఓ కార్యాలయ అధికారి ఇక్బాల్ సాహెబ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాషా పాల్గొన్నారు.
వినుకొండ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
వినుకొండ: ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో వినుకొండ ఫొటోగ్రాఫర్లు వంగపల్లి బ్రహ్మయ్య, కేసానుపల్లి సుబ్బారావులు అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న ఇరువురుని వినుకొండ ఫొటోగ్రాఫర్లు అభినందించారు.
విరిగిన ఇనుప గడ్డర్‌తో ఇబ్బందులు
తెనాలి రూరల్: తెనాలి–చందోలు మార్గంలోని వైకుంఠపురం రైల్వే వంతెన వద్ద తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో వంతెన దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన ఇనుప గడ్డర్‌ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విరిగి కింద పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం మరమ్మతులు చేయించారు. తరచూ గడ్డర్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గాంధీ ఆశ్రమానికి రూ.లక్ష విరాళం
తెనాలి అర్బన్: పెదరావూరుకు చెందిన షేక్ హానీఫ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బాషా మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమ నిర్వాహణకు రూ.లక్ష చెక్కును నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. బుర్రిపాలెం రోడ్డులోని ఆశ్రమంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో షేక్ జానీ సైదా, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు, రేపు మంగళగిరిలో సీఎం పర్యటన