
వైఆర్‌ఎస్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
రెంటచింతల: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘మహాత్ముడు నడయాడిన రెంటచింతల’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు స్పందించి, నాడు మహాత్ముడు బస చేసిన వైఆర్‌ఎస్ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో గ్రామానికి చెందిన పల్నాటి గాంధీగా పేరు పొందిన నాళం మట్టపల్లి కుటుంబ సభ్యులను కలువడానికి అవకాశం ఉందా? ఆయన వారసులు ఎవరు.. ఎక్కడున్నారని.. వాకబు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమ యంలో ఈ ప్రాంతంలో నెలకొన్న సంగతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైఆర్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులతో మమేకమై, వారికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య, విద్యా వలంటీర్ల వేతనాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. పాఠ శాల వెనుకనున్న గదులను ఎందుకు మూసివేశారని అడిగారు. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉన్నారని, మిగిలిన వారు విద్యా వలంటీర్లుగా పనిచేస్తున్నారని వా రికి పూర్వ విద్యార్థులు అందజేసిన విరాళాలతో వేతనాలు అందచేస్తున్నామని గతంలో 700 మందికి పైగా విద్యార్థులు ఉండేవారని హెచ్‌ఎం కొత్త చంద్రశేఖర్, కరస్పాండెంట్ యేచూరి వెంకట సైదయ్యలు కలెక్టర్‌కు వివరించారు.