
నాగార్జునకొండలో పర్యాటకుల సందడి
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు నాగార్జునసాగర్ చేరుకొని స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాగసిరి లాంచీ, శాంతిసిరి లాంచీలలో వెళ్లారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యాంపీ స్టేడియం, శ్రీ రంగనాథస్వామి దేవాలయాలను సందర్శించారు. అనంతరం ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. పర్యాటకులు నాగార్జునకొండను సందర్శించటంతో లాంచీస్టేషన్‌కు రూ.1,88,150 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
అచ్చంపేట: ఎగువ నాగార్జునసాగర్, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రం ఏడు గంటల వరకు పులిచింతల ప్రాజెక్టుకు 2,08,330 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 6 క్రస్ట్ గేట్ల ద్వారా 1,93,855 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 38.4077 టీఎంసీలు ఉంది.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కందుల లక్ష్మణరావు కుటుంబం ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన కందుల లక్ష్మణరావు, విజయ వెంకట లక్ష్మి, కుమారుడు, కోడలు రామప్రసాద్, ప్రభాచంద్ర, మనవడు, మనవరాలి పేరిట రూ. 1,00,116 విరాళాన్ని నిత్యాన్నదానానికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తజనంతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం నిండిపోయింది. శ్రావణమాసం ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతోపాటు సుదూర స్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
రొంపిచర్ల: రొంపిచర్ల సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. సుబ్బయ్యపాలెం క్రాస్‌రోడ్‌లో భారీ లారీలో డీజిల్ అయిపోయి మరమ్మతులకు గురైంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కూడా వాహన చోదకులు సమాచారం అందించారు. ఎవరూ స్పందించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగార్జునకొండలో పర్యాటకుల సందడి

నాగార్జునకొండలో పర్యాటకుల సందడి

నాగార్జునకొండలో పర్యాటకుల సందడి