ట్రావెల్స్ వాహనం బోల్తా
పలువురికి గాయాలు
మార్టూరు: జాతీయ రహదారిపై మంగళవారం టూరిస్ట్ వాహనం బోల్తా పడిన సంఘటనలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని విజయవాడ వైపు వెళుతున్న సుమారు 15 మంది ప్రయాణికులతో కూడిన ట్రావెల్స్ వాహనం మంగళవారం ఉదయం చిలకలూరిపేట వైపు వెళుతోంది. రాజుపాలెం కూడలి దాటిన తర్వాత ట్రావెల్స్ వాహనం ముందు వెళ్తున్న మరో వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి రహదారికి పడమర వైపు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ వాహనం మధ్యలో ఉన్న డివైడర్‌ను దాటుకుంటూ రహదారికి తూర్పు వైపు గల పొలాల్లోకి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న ఓ వ్యక్తి క్యాబిన్లో ఇరుక్కుపోగా స్వల్పంగా గాయపడిన మిగిలిన ప్రయాణికులు వాహనం క్యాబిన్ డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి బాధితుడిని తమతో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించుకొనివెళ్లారు.
లోడ్ కిందపడి కార్మికుడు మృతి
చెరుకుపల్లి: ప్రమాదవశాత్తు తాటి మొద్దుల లోడ్ కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చెరుకుపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని ఆరుంబాక ఎస్సీ కాలనీకి చెందిన వేము ఆదినారాయణ (40) చెరుకుపల్లిలోని ఒక కోత మిషన్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం తాటి మొద్దుల లోడు దింపుతుండగా కింద పడ్డాడు. అతనిపై తాటి మొద్దులు పడ్డాయి. తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
యువకుడి వేధింపులతో
మహిళ ఆత్మహత్యాయత్నం
కొల్లూరు: వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని సహజీవనం చేస్తున్న యువకుడు వేధింపులకు పాల్పడటంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను భర్త వదిలి వెళ్లిపోయాడు. తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ కొన్నేళ్లగా ఆమె పుట్టింటి వద్ద ఉంటోంది. అదే గ్రామానికి చెందిన పరిశ గోపికృష్ణ పరిచమయ్యాడు. కొన్నాళ్ల తర్వాత సహజీవనం చేస్తున్నారు. ఆమె నుంచి అవసరాల నిమిత్తం అతడు రూ. 1.75 లక్షలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని ఆమె అడగడంతో మాట దాట వేస్తూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మళ్లీ డబ్బు అవసరం ఉందని అడిగాడు. ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతానని వేధించాడు. దీంతో బాధితురాలు ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు పేస్టును కూల్‌డ్రింక్‌లో కలిపి తాగింది. మధ్యాహ్నం కుటుంబసభ్యులు వచ్చాక గమనించి 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అర్జున్‌రావు తెలిపారు.
ట్రావెల్స్ వాహనం బోల్తా
ట్రావెల్స్ వాహనం బోల్తా


